సుప్రీంకోర్టు ముందస్తు ఝలక్.. స్టే విధించే అధికారం హైకోర్టుకు

 

ఓ వైపు తెరాస అసెంబ్లీ రద్దు చేసి, అభ్యర్థులను ప్రకటించి, ప్రచారం మొదలుపెట్టి ముందస్తు వైపు ఆశగా అడుగులు వేస్తోంది. మరోవైపు మహాకూటమి సీట్ల సర్దుబాటు చర్చలతో మునిగితేలుతోంది. అయితే కొందరు మాత్రం అసలు ముందస్తు ఉంటుందా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ముందస్తుకు నిలిపివేయాలంటూ ఇప్పటికే హైకోర్టులో చాలా పిటిషన్లు దాఖలయ్యాయి. అదేవిధంగా సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ పైన సుప్రీం కోర్టులో తాజాగా విచారణ జరిగింది. అన్ని పిటిషన్లను రేపే విచారణ చేపట్టాలని హైకోర్టుకు సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల పైన స్టే విధించవలసి వస్తే హైకోర్టుకు ఆ అధికారం ఉందని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. ఈ నెల 8వ తేదీన ఎన్నికల సంఘం ఓటర్ల తుది జాబితాను విడుదల చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆ లోపే విచారణ పూర్తి కావాలని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. మరోవైపు ఓటర్ల జాబితా విషయంలో అవకతవకలు కనిపిస్తే హైకోర్టు స్టే విధిస్తుందనే ఆశతో విపక్షాలు ఉన్నాయి. అదే జరిగితే తెరాసకు షాక్ అని చెప్పవచ్చు. చూద్దాం మరి ఏం జరుగుతుందో.