జగన్ సర్కార్ కి హైకోర్టు షాక్... తొలగించాల్సిందే!!

వైసీపీ ప్రభుత్వానికి ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఏపీలోని పంచాయతీ కార్యాలయాలకు వేసిన వైసీపీ రంగులను తొలగించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పంచాయతీ కార్యాలయాలకు పార్టీ రంగులను వేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. పంచాయతీ కార్యాలయాలు ప్రభుత్వానివని, వాటికి పార్టీ రంగులు ఉండకూడదని హైకోర్టు తేల్చి చెప్పింది.

పంచాయతీ ఎన్నికలు వస్తున్నందున పార్టీ రంగులు కార్యాలయాలపై ఉండకూడదని, వాటిని వెంటనే తొలగించాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. కార్యాలయాలకు రంగుల తొలగింపు వ్యవహారంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా బాధ్యత తీసుకోవాలని హైకోర్టు సూచించింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ఎన్నికల సంఘానికి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ ఫిబ్రవరి 5 కు వాయిదా వేసింది.

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రభుత్వ భవనాలకు వారి పార్టీ రంగులు వేస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తూనే ఉన్నాయి. ఒకవైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు అంటూనే.. మరోవైపు పార్టీ రంగుల కోసం వందల కోట్లు ఖర్చు చేస్తున్నారని.. జగన్ సర్కార్ పై విపక్షాలు మండిపడ్డాయి. అయితే పంచాయతీ కార్యాలయాలకు రంగులేయడం మానలేదు. దాదాపు అన్ని పంచాయతీ కార్యాలయాలు వైసీపీ రంగులతో నిండిపోయాయి. అయితే ఇప్పుడు ఈ రంగుల వ్యవహారంలో హైకోర్టు షాక్ ఇవ్వడంతో.. వేసిన రంగులని తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

హడావుడిగా రంగులు వేసి వృధా ఖర్చు చేశారు. ఇప్పుడు ఆ రంగులు తొలగించడానికి మళ్లీ అదనపు ఖర్చు. ఇలా వందల కోట్లు రంగుల పేరుతో వృధా చేసేబదులు.. ఏదైనా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయొచ్చు కదా అని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఆ ఖర్చుతో చిన్న ప్రాజెక్ట్ లు పూర్తీ అయ్యేవని లేదా కొన్ని ప్రభుత్వ పాఠశాలలు బాగుపడేవని మేధావి వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.