నారా రోహిత్ కి తెలంగాణ టీడీపీ పగ్గాలు!!

సినీ నటుడు, చంద్రబాబు సోదరుడి కుమారుడు నారా రోహిత్ తెలంగాణ తెలుగుదేశం పగ్గాలు చేపట్టనున్నారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 

 

అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా తెలంగాణ తెలుగుదేశం ఆధ్వర్యంలో తలసీమియా బాధితుల కోసం ఓ మెగా బ్లడ్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. తెలంగాణ తెలుగుదేశం కుటుంబ సభ్యులు అందరూ తగిన కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటూ.. ఈ క్యాంప్‌ను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను అంటూ నారా రోహిత్ టీటీడీపీ కార్యకర్తలను ఉద్దేశించి ఓ వీడియో సందేశాన్ని ఇచ్చారు. దీంతో తెలంగాణలో టీడీపీ బాధ్యతను రోహిత్ తీసుకోబోతున్నారంటూ ప్రచారం మొదలైంది.

 

నారా రోహిత్ గతంలో పలు సందర్భాలలో టీడీపీ తరఫున తన వాణిని వినిపించారు. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గానే ఉంటారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో టీడీపీ తరఫున ప్రచారం కూడా చేశారు. దీంతో టీటీడీపీ పగ్గాలు నారా రోహిత్ అందుకోనున్నారన్న ప్రచారాన్ని పూర్తిగా కొట్టి పారేయలేమని అంటున్నారు. దానికి తోడు ఇటీవల టీటీడీపీ అధ్యక్షుడి మార్పుపై చంద్రబాబుకి పలువురు నేతలు లేఖలు రాసిన నేపథ్యంలో ఈ ప్రచారం తెరమీదకు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

 

రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో టీడీపీ కేడర్ డీలా పడింది. పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చే నాయకుడి కోసం ఎదురుచూస్తుంది. గతంలో తెలంగాణలో టీడీపీ పగ్గాలు జూనియర్ ఎన్టీఆర్ కి ఇవ్వాలన్న డిమాండ్స్ వినిపించాయి. ఎన్టీఆర్ వస్తే పార్టీలో కొత్త ఉత్సాహం వస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే, ఎన్టీఆర్ స్టార్ హీరోగా సినిమాలలో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ టైములో ఆయన సినిమాలను వదిలేసి రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదు. 

 

ఇక, రోహిత్ విభిన్న సినిమాలతో తనకంటూ ప్రత్యేక పేరుని సంపాదించుకున్నారు. పార్టీ కార్యకర్తలలో సోషల్ మీడియాలో టచ్ లో ఉంటూ.. అవసరమైన సందర్భంలో పార్టీ తరఫున తన వాణిని వినిపిస్తున్నారు. మరి కేడర్ లో కొత్త ఉత్సాహం నింపడానికి రోహిత్ కి చంద్రబాబు తెలంగాణ టీడీపీ పగ్గాలు ఇస్తారా? అసలు రోహిత్ ఆసక్తిగా ఉన్నారా? అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు, తెలంగాణలో పార్టీ పూర్వవైభవం కోసం చంద్రబాబు తీవ్ర కసరత్తు చేస్తున్నారని, త్వరలోనే కీలక వ్యక్తికి పగ్గాలు అప్పగిస్తారని సమాచారం.