హెరిటేజ్ మీద తప్పుడు ప్రచారం

 

హెరిటేజ్ పాల నాణ్యత సరిగా లేదని, అందువల్లే కేరళలో ఆ పాలను నిషేధించారని తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో టీఆర్ఎస్ సభ్యుడు రవీంద్ర రెడ్డి చేసిన వ్యాఖ్యలను తెలంగాణ తెలుగుదేశం నాయకుడు రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించిన విషయం తెలిసిందే. హెరిటేజ్ పాల మీద నిషేధం విధించిన కేరళ ప్రభుత్వం తన తప్పు తెలుసుకుని నిషేధాన్ని ఎత్తివేసిన విషయం టీఆర్ఎస్ సభ్యుడికి తెలియక ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. ఈ విషయం మీద హెరిటేజ్ సంస్థ ప్రతినిధి సాంబశివరావు స్పందించారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో హెరిటేజ్ పాల మీద చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. కేరళ రాష్ట్రంలో హెరిటేజ్ సంస్థ పాలను నిషేధించారని అనడం అవాస్తమని చెప్పారు. హెరిటేజ్ డెయిరీకి సొంతగా పాడి పశువులు లేవని ఆయన చెప్పారు. రైతుల దగ్గర నుంచి సేకరించిన పాలనే హెరిటేజ్ విక్రయిస్తుస్తుందని ఆయన చెప్పారు. కేరళ తాము విక్రయించే ‘పద్మనాభ’ రకం పాలనే నిలుపుదల చేసిందని, మిగతా అన్ని ఉత్పత్తులూ కేరళలో అమ్మకాలు జరుగుతున్నాయని వివరించారు. పద్మనాభ పాల నాణ్యతా ప్రమాణాలను చూసిన తర్వాత కేరళ ప్రభుత్వం ఆ పాల మీద ఉన్న నిషేధాన్ని తొలగించిందని కూడా ఆయన వెల్లడించారు.