భారత్ లో కరోనాకు వ్యాక్సిన్ ఒక్కటే పరిష్కారం.. కేంద్ర ఆరోగ్య శాఖ

భారత్ లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 16 లక్షలు దాటింది. ప్రతి రోజు రికార్డ్ సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం తాజాగా కీలక వ్యాఖ్యలు చేసింది. భారత్ లాంటి అధిక జనాభా గల దేశంలో హార్డ్ ఇమ్యూనిటీ అసాధ్యం అని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. భారతదేశ జనాభా పరిమాణాన్ని బట్టి హార్డ్ ఇమ్మ్యూనిటి ఓ ఆప్షన్ కానే కాదని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కరోనాను అరికట్టే వ్యాక్సిన్ వచ్చేవరకు ప్రస్తుత పద్దతిలోనే కరోనా తో పోరాడాల్సి ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఓఎస్డీ రాజేష్ భూషణ్ తెలిపారు.

భారత్ వంటి దేశంలో హెర్డ్ ఇమ్యూనిటీ అనే ఆప్షన్ పనికి రాదని వ్యాక్సిన్ లేకుండా హెర్డ్ ఇమ్యూనిటీని సాధించడం దాదాపుగా అసాధ్యం అని ఈ సమయంలో దాన్ని అమల్లోకి తేస్తే.. కోట్లాది మంది ప్రజలు అనారోగ్యానికి గురవడమే కాకుండా ప్రాణ నష్టం కూడా అధికంగా ఉంటుందని అయన అన్నారు. భవిష్యత్తులో వ్యాక్సిన్ అభివృద్ధి చేసిన తర్వాతనే హార్డ్ ఇమ్యూనిటీ అమల్లోకి వస్తుంది. అప్పటి వరకు ప్రస్తుత పద్దతిలోనే కరోనాను ఎదుర్కొవాలని రాజేష్ భూషణ్ తెలిపారు. అంతే కాకుండా కరోనా రోగులలో రికవరీ రేటు ఏప్రిల్లో 7.85 శాతం ఉండగా ప్రస్తుతం 64.44 శాతానికి పెరిగింది అన్నారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణాలు భారత్ లోనే తక్కువన్నారు.