కోడి క‌త్తి గుర్తు కావాలంటున్న ఇండిపెండెంట్లు.. క్రెడిట్ జగన్ దేనా

 

ఎన్నికలలో పోటీచేసే అభ్యర్థులు గుర్తు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ప్రధాన పార్టీల నుంచి పోటీ చేసే అభ్యర్థులకైతే ఏ సమస్య ఉండదు. ఆ పార్టీ పేరు, గుర్తు ఆల్రెడీ ప్రజలకు తెలుసు. తమ పార్టీ గుర్తు కనపడగానే ఓటు గుద్దేస్తారు. కానీ ఇండిపెండెంట్ల పరిస్థితి అలా కాదు. ప్రజల్లోకి త్వరగా తీసుకెళ్లే గుర్తును ఎన్నికల సంఘం కేటాయించాలని ఆశపడుతుంటారు. త్వరలో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో బరిలోకి దిగబోతున్న ఇండిపెండెంట్లు కొందరు.. ఒక గుర్తుకోసం తెగ ఆసక్తికనబరుస్తున్నారట. ఇంతకీ ఆ గుర్తు ఏంటో తెలుసా?.. కోడి కత్తి గుర్తు. వైజాగ్ ఎయిర్‌పోర్ట్‌లో జ‌గ‌న్‌పై దాడి త‌ర్వాత తెలుగు రాష్ట్రాల్లో కోడి క‌త్తి బాగా పాపుల‌ర్ అయ్యింది. అయితే తెలంగాణ ఎన్నిక‌ల మీద కూడా దాని ప్రభావం స్పష్టంగా క‌నిపిస్తోంది. ఇండిపెండెంట్లుగా ఎన్నిక‌ల్లో బరిలోకి దిగాల‌ని భావిస్తున్న కొంత మంది ఈ గుర్తు త‌మ‌కు కేటాయిస్తారా అంటూ కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్రతినిధుల్ని సంప్రదించారట. అయితే అది సాధ్యం కాద‌ని.. ఎన్నికల సంఘం ఆమోదించిన కొన్ని గుర్తుల్లో ఒక‌టి మాత్రం తీసుకోవ‌డానికి అవ‌కాశం ఉంటుంద‌ని ఎన్నిక‌ల అధికారులు వారికి స‌ర్దిచెప్పే ప్రయ‌త్నం చేశారట. అయినా వారు వినకుండా.. క‌మ్యూనిస్టు పార్టీల‌కు కంకి కొడ‌వ‌లి, సుత్తి కొడ‌వ‌లి ఇలాంటి గుర్తులు ఉన్నప్పుడు.. త‌మ‌కు కోడి క‌త్తి ఎందుకు ఇవ్వరంటూ వారు ఎన్నిక‌ల సంఘాన్ని నిల‌దీయడంతో.. పై అధికారుల‌కు ఈ విష‌యం తెలియ‌జేస్తామని చెప్పి వారు తప్పించుకున్నట్టు సమాచారం. ఈ వార్తలో నిజమెంతో తెలీదు కానీ.. ఇలా కోడి కత్తి గుర్తుని కేటాయించమంటే వారు మాత్రం ఏం చేస్తారు పాపం.