బడ్డీ కొట్టుకి 132 కోట్ల కరెంట్ బిల్లు

 

హర్యానాలో విద్యుత్ శాఖ ఒక ఘనకార్యం చేసింది. ఓ పాన్‌వాలాకు 132 కోట్ల రూపాయల కరెంటు బిల్లు పంపింది. ఆ బిల్లు చూసి ఒళ్ళు ఝల్లుమన్న ఆ పాన్ వాలా లబోదిబోమన్నాడు. హర్యానా ఎలక్ట్రిసిటీ బోర్డుతో ఇదేంటండీ బాబూ అని మొరపెట్టుకున్నాడు. అయితే ఈ పారపాటును గ్రహించి నాలుక్కరుచుకున్న హర్యానా ఎలక్ట్రిసిటీ బోర్డు ఇప్పుడేం చేయాలా అనే తర్జనభర్జనలో పడింది. ఇంత భారీ బిల్లు అందుకున్న పాన్ వాలా మాట్లాడుతూ, ‘‘ఇంత భారీ కరెంట్ బిల్లును చూసి షాకైపోయాను. అంకెల్లో ఏమైనా తప్పు పడిందేమోనని పరిశీలనగా చూడగా అక్షరాల్లో కూడా అంతే మొత్తం ఉంది. నా పాన్ షాప్‌లో కేవలం ఒక బల్బుతో పాటు ఒక ఫ్యాన్ మాత్రమే వినియోగిస్తున్నాను. ఇప్పటి వరకూ నాకు నెలకు వెయ్యి రూపాయల లోపే బిల్లు వస్తోంది. ఈ నెల మాత్రం 132 కోట్ల రూపాయల బిల్లు వచ్చేసరికి మైండు తిరిగిపోయింది’’ అన్నాడు. మరి ఈ విషయంలో హర్యానా విద్యుత్ అధికారులు ఏం చేస్తారో చూడాలి. సాధారణంగా ఎక్కువ మొత్తంలో బిల్లు వస్తే ముందు బిల్లు కట్టండి ఆ తర్వాత అడ్జెస్ట్ చేద్దామని చెప్పే విద్యుత్ అధికారులు ఇప్పుడు ఈ 132 కోట్ల బిల్లు విషయంలో ఏమంటారో చూడాలి.