హరీశ్‌రావు టీఆర్ఎస్‌ను చీలుస్తాడా..?


సీఎంగా కేసీఆర్‌ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. టీఆర్‌ఎస్‌ అధ్యక్ష హోదాలో శుక్రవారం తన తనయుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌కు పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ హోదాను కట్టబెట్టారు. సీఎం కేసీఆర్‌ శనివారం ప్రగతి భవన్‌లో సాగునీటి ప్రాజెక్టులపై సమగ్ర సమీక్ష చేపట్టబోతున్నట్లు ఆయన కార్యాలయం శుక్రవారమే ప్రకటించింది. చెప్పినట్లుగానే కేసీఆర్‌ తన క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్‌లో శనివారం సాగునీటి ప్రాజెక్టులపై దాదాపు ఏడు గంటలపాటు సమీక్ష జరిపారు. ఈ సమావేశంలో నీటిపారుదల శాఖ తాజా మాజీ మంత్రి హరీశ్‌రావు కనిపించలేదు.కాగా ఇవాళ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్ బాధ్యతలు స్వీకరించే కార్యక్రమానికి హరీశ్ రావు వస్తారా.. లేదా అన్న చర్చ నడిచింది. దీనికి కారణం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్‌ను నియమించినప్పటి నుంచి తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో వేడి మొదలైంది. ముఖ్యంగా హరీశ్ రావు పరిస్థితి ఏంటీ..? ఆయన టీఆర్ఎస్‌ను చీలుస్తాడా..? బావకి అన్ని రకాలుగా సహయ సహకారాలు అందిస్తారా..? లేదంటే తన దెబ్బ తెలియజేస్తారా అంటూ రకరకాలగా జనం చర్చించుకుంటున్నారు.  ఈ నేపథ్యంలో హరీశ్ రావు హాజరై కేటిఆర్‌కి తన అభినందనలు తెలిపారు. ఈ పరిణామంతో పార్టీ శ్రేణులతో పాటు తెలుగు రాష్ట్రాల ప్రజలు షాక్‌కు గురయ్యారు. కానీ భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా తెలంగాణ ప్రాజెక్ట్‌లను పరుగులు పెట్టించి రాష్ట్ర ప్రజల్లో మంచి ఇమేజ్ సంపాదించుకున్నాడు హరీశ్‌రావు. నగరాలు, పట్టణాల్లో కేటీఆర్‌కు ఇమేజ్ ఉంటే.. పల్లె సీమల్లో హరీశ్ ఛరిష్మా ముందు ఎవరైనా దిగదుడుపే. అలాంటి తన పరిస్థితి రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతోందన్న భయం హరీశ్‌ను వెంటాడుతోందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.