మా ఆస్తులపై సీబీఐ విచారణ కాంగ్రెస్ కుట్రే: హరీష్‌రావు ఆక్రోశం

 

 

 

టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్, టీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు, మెదక్ ఎంపీ విజయశాంతి తన ఆస్తులపై విచారణకు నాంపల్లి సీబీఐ కోర్టు ఆదేశాలు జారీచేసింది. బాలాజీ అనే న్యాయవాది దాఖలు చేసిన ప్రైవేట్ ఫిర్యాదుకు స్పందించిన సీబీఐ కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ ఉద్యమాన్ని అడ్డం పెట్టుకుని టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌తోపాటు ఆయన మేనల్లుడు హరీష్‌రావు, కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి భారీగా అక్రమ ఆస్తులు కూడబెట్టారని, సీబీఐతో దర్యాప్తు చేయిస్తే వాస్తవాలు వెలుగు చూస్తాయని బాలాజీ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో సీబీఐ కోర్టు ఆ ముగ్గురి ఆస్తులపై విచారణ జరపాలని శుక్రవారం ఎస్పీకి ఆదేశాలు జారీచేసింది. ఈ ఆదేశాలు కాంగ్రెస్ పార్టీ కుట్రలో భాగమని హరీష్ రావు అన్నారు. తమ ఆస్తులపై విచారణకు తాము స్వాగతిస్తున్నామని ఆయన చెప్పారు. తన మాట వినని పార్టీలను దారిలోకి తెచ్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీ సీబీఐని పావులా వాడుకుంటోందని ఆయన విమర్శించారు. తన రాజకీయ అవసరాల కోసం సీబీఐను వాడుకోవడం కాంగ్రెస్ పార్టీకి కొత్తేమి కాదని హరీష్ రావు అన్నారు.