హరీష్ మీద కాంగ్రెస్ కన్ను!

 

 

 

కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం పోయిన చోటే వెతుక్కునే సిద్ధాంతాన్ని మరచిపోయింది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడం బెటర్ అని ఆలోచిస్తున్నట్టుంది. సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ అడ్డంగా ఆరిపోయింది. దాంతో ఆ పార్టీలో వున్న వారు తెలుగుదేశం పార్టీలోకి పారిపోతున్నారు. కాంగ్రెస్ నుంచి తెలుగుదేశంలోకి వెళ్ళిన వారితో రోజుకో లిస్టు న్యూస్ పేపర్లలో కనిపిస్తోంది. సీమాంధ్రలో ఎలాగూ ఆరిపోతానని డిసైడైపోయిన కాంగ్రెస్ పార్టీ సీమాంధ్రలో వ్రతం చెడ్డా తెలంగాణలో ఫలం దక్కాలని భావిస్తోంది.

 

అందుకే తెలంగాణలో ఇతర పార్టీల నుంచి నాయకులను తనలోకి లాక్కునే ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. ముఖ్యంగా తనకు టెంకెజెల్ల కొట్టిన టీఆర్ఎస్ మీద కాంగ్రెస్ దృష్టి కేంద్రీకరించింది. తెలంగాణ ఇచ్చిన క్రెడిట్ ఇప్పటికే తమ పార్టీ అకౌంట్లో వుంది. దీనికి తోడు కొంతమంది కీలక టీఆర్ఎస్ నాయకులను తమ పార్టీలోకి లాక్కుంటే రాజకీయంగా తనకు మరింత ప్లస్ అయ్యే అవకాశం వుందని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు. టీఆర్ఎస్‌లో అత్యంత కీలకంగా వుండే నాయకుడిని కాంగ్రెస్‌లోకి తీసుకొస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నట్టు తెలుస్తోంది. దాంతో చాలామంది టీ కాంగ్రెస్ నాయకులు తెరాసలో కీలకంగా వున్న హరీష్ రావు వైపు ఆశగా చూస్తున్నట్టు రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.



హరీష్ రావు తలకిందులుగా తపస్సు చేసినా టీఆర్ఎస్‌లో ఆయన మూడో స్థానంలోనో, నాలుగో స్థానంలో నిలుస్తారు. మొదటి రెండు స్థానాలూ కేసీఆర్, కేటీఆర్ ఆక్రమించేశారు. హరీష్ మొదటి స్థానంలోకి రావడం అంత సులభంగా సాధ్యమయ్యే విషయం కాదు. రాష్ట్ర స్థాయిలో ప్రతి రాజకీయ నాయకుడూ కోరుకునే ముఖ్యమంత్రి పదవి కేసీఆర్‌కే ప్రస్తుతం ఆమడ దూరంలో వుంది. ఆ పదవి హరీష్ రావుకి చేరువ కావడం కలలోమాటగానే వుంది. అయితే తెలంగాణ స్టేట్‌కి ముఖ్యమంత్రి అయ్యే ఆఫర్ ఇచ్చి హరీష్ రావుని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తే బాగుంటుందన్న అభిప్రాయం అనేకమంది టీ కాంగ్రెస్ నేతల్లో వున్నట్టు తెలుస్తోంది. వైఎస్సార్ బతికి వుండగా అప్పట్లో హరీష్ రావు కాంగ్రెస్ పార్టీలో చేరే ప్రయత్నాలు చేశారు. అయితే వైఎస్సార్ మరణంతో ఆ ప్రయత్నాలు ఆగిపోయాయి. ఇప్పుడు మళ్ళీ హరీష్ రావులో ‘ముఖ్యమంత్రి’ ఆశలు రేపడం ద్వారా కాంగ్రెస్‌లోకి తేవాలన్న ఆలోచనలు, సమాలోచనలు జరుగుతున్నట్టు సమాచారం.