హిందూపురం: బాలకృష్ణపై హరికృష్ణ పోటీ?

 

ఈసారి ఎన్నికలలో పోటీ చేసి గెలిచేయాలని ఉవ్విళ్ళూరుతున్న హరికృష్ణని తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎంతమాత్రం పట్టించుకోవడం లేదు. ఇప్పటి వరకు తాను గతంలో ప్రాతినిధ్యం వహించిన హిందూపురం, కృష్ణాజిల్లాలోని పెనమలూరు, నూజివీడు స్థానాల మీద ఆశలు పెట్టుకున్న హరికృష్ణకి నిరాశే ఎదురైంది. ఏ సీటు అడిగినా చంద్రబాబు ఇవ్వకపోవడంతో హరికృష్ణ ఆగ్రహంతో రగిలిపోతున్నట్టు సమాచారం. తనను నిర్లక్ష్యం చేయడం వల్ల ఎంత మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుందో చంద్రబాబుకి ప్రాక్టికల్‌గా రుచి చూపించాలని హరికృష్ణ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే అన్నయ్య ఇష్టపడుతున్నాడని కూడా పట్టించుకోకుండా హిందూపురం సీటు మీద ఆసక్తి చూపించి, సదరు సీటు తనకి దక్కకుండా చూసిన బాలకృష్ణ మీద కూడా హరికృష్ణ కోపంగా వున్నాడట. అందువల్ల అటు చంద్రబాబుకి, ఇటు బాలకృష్ణకి జాయింట్‌గా షాక్ ఇవ్వడానికి హరికృష్ణ ఆలోచిస్తున్నట్టు సమాచారం. హిందూపురం నుంచి ఇండిపెండెంట్‌గా కానీ, ఏదైనా పార్టీ ద్వారాగానీ పోటీ చేసి, తనతోపాటు జూనియర్ ఎన్టీఆర్‌ కూడా హిందూపురంలోనే మకాం వేసి గెలవాలని హరికృష్ణ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఇలా చేయడం మంచి పద్ధతి కాదని కుటుంబ సభ్యులు సర్ది చెబుతున్నప్పటికీ హరికృష్ణ ఆగ్రహానికి ఆనకట్ట పడటం లేదని వినికిడి. నిజంగానే హిందూపురం నుంచి బాలకృష్ణకి వ్యతిరేకంగా హరికృష్ణ పోటీ చేస్తే కుటుంబ రాజకీయం మాంఛి రసపట్టుకు చేరుకోవడం ఖాయం.