మొగల్తూరు మొనగాడి గన్ను ఢాం...

 

కోతికి కొబ్బరి చిప్ప దొరికితే ఏం జరుగుతుంది? ఆ కానిస్టేబుల్ చేతికి గన్ను ఇస్తే అదే జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ కార్యాలయంలో మొగల్తూరుకు చెందిన చినబాబు కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అతనికి ఈమధ్యే గన్ను ఇచ్చారు. ఆ గన్నుతో పొటోలు దిగాలని, పోలీస్ స్టోరీ సినిమాలో సాయికుమార్‌లా పోజులివ్వాలని ముచ్చటపడ్డాడు. అక్కడో ఇక్కడో ఎందుకు పోజులివ్వడమని, ఏకంగా ఎస్పీ కార్యాలయంలోనే ఫొటో సెషన్ పెట్టేశాడు. ఈయనగారు గన్ను పట్టుకుని రకరకాల పోజులిస్తుంటే మరో కానిస్టేబుల్ ఫొటోలు తీస్తున్నాడు. ఇంతలో అకస్మాత్తుగా చినబాబు చేతిలోని గన్ను ఒక్కసారిగా పేలింది. ముఖం ముందు నుంచి దూసుకెళ్ళిన బుల్లెట్ గోడలో దిగబడింది. అకస్మాత్తుగా ఢామ్మని సౌండ్ రావడంతో ఎస్పీ కార్యాలయంలో వున్నవాళ్ళంతా ఎవరైనా దాడిగానీ చేశారా అని భయపడిపోయారు. ఆ తర్వాత ఇదంతా చినబాబు నిర్వాకం అని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు. చినబాబు మాత్రం ముఖం ముందు నుంచి వెళ్ళిన బుల్లెట్ ఇంకాస్త ఇవతలి నుంచి వెళ్తే పరిస్థితి ఎలా వుండేదో అని తలుచుకుని గడగడా వణికిపోతున్నాడు. ఈ అంశం మీద పోలీసు ఉన్నతాధికారులు విచారణ చేస్తున్నారు.