తెలంగాణలో తుపాకుల మోత... మాజీ మావోల ఇళ్లల్లో సోదాలు...

తెలంగాణలో గన్ కల్చర్ పెరిగిపోతోంది. ఇప్పటివరకు అప్పడప్పుడూ హైదరాబాద్ లో మాత్రమే కనిపించిన తుపాకీ కాల్పులు ఇప్పుడు తెలంగాణ గ్రామాల్లో విచ్చలవిడిగా జరుగుతున్నాయి. అమెరికన్ల తరహాలో తుపాకి కలిగి ఉండాలనే కోరిక ఇటీవల పెరిగిపోతోంది. గన్ పేల్చాలన్న సరదా... ఏదోఒక టైమ్ లో ఉపయోగపడుతుందన్న లెక్కలతో అక్రమంగా తుపాకులు కొనుగోలుచేసి ఇళ్లల్లో దాచుకుంటున్నారు. ఎప్పుడైనా తీవ్ర ఆవేశానికి గురైనప్పుడో... లేక పట్టలేని సంతోషంలో ఉన్నప్పుడో... నలుగురిలో గొప్ప కోసమే తుపాకీని బయటికి తీసి కాల్పులు జరుపుతున్నారు. దాంతో, జనం ఒక్కసారిగా ఉలిక్కిపడుతున్నారు.

ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జరిగిన కాల్పుల మోత ప్రజలను కలవరపెడుతోంది. నెలరోజుల వ్యవధిలో మూడుచోట్ల కాల్పులు జరగడంతో పోలీసుల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. మొదట, జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం ఇస్రాజ్‌పల్లిలో భార్యాభర్తల గొడవలో తీవ్ర ఆవేశానికి గురైన భర్త నాటు తుపాకీతో కాల్పులు జరపడంతో ఒకరు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆ తర్వాత అక్కన్నపేటలో ఏకే47 ఫైరింగ్ అయితే రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించింది. ఎందుకంటే, పోలీస్ స్టేషన్ లో మాయమైన ఏకే47తో కాల్పులు జరపడం కల్లోలం రేపింది. ఇక, ఇప్పుడు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం శాయంపేటలో ఆర్మీ రిటైర్డ్ జవాను గాల్లోకి కాల్పులు జరపడంతో జనం భయంతో వణికిపోతున్నారు.

పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం శాయంపేటలో మాజీ సైనికుడు తిరుమల‌రెడ్డి గాల్లోకి కాల్పులు జరపడం స్థానికంగా కలకలం రేపింది. తిరుమలరెడ్డి గాల్లోకి కాల్పులు జరుపుతుండగా వీడియో తీసిన కొందరు సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దాంతో, తిరుమలరెడ్డి నిర్వాకం వెలుగులోకి వచ్చింది. దీనికంటే ముందుగా రెండుసార్లు తిరుమలరెడ్డి కాల్పులు జరిపినా అవి బయటికి రాలేదు. అయితే, మూడోసారి జరిపిన కాల్పులు అతడిని పట్టించాయి. ఆర్మీలో ఉండగా జమ్మూలో తుపాకీ కొనుగోలు చేసిన తిరుమలరెడ్డి... మొత్తం 20 రౌండ్ల బుల్లెట్లలో 14 రౌండ్ల కాల్పులు జరిపాడు. ఇక, మిగిలిన 6 రౌండ్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

అయితే, తెలంగాణలో పెరిగిపోతున్న గన్ కల్చర్ పై పోలీసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్కన్నపేట ఘటనలోనూ గన్‌ పేల్చాలన్న కోరికతోనే కాల్పులు జరిపినట్లు రిమాండ్ రిపోర్ట్‌ చెబుతోంది. ఇక, తిరుమలరెడ్డి కూడా సరదా కోసమే ఆకతాయిగా కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. అయితే, గన్ పేల్చాలన్న సరదా కారణంగా గ్రామాల్లో గన్‌ కల్చర్‌ పెరిగిపోతోందని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రతి ఒక్కరిలో గన్ పేల్చాలన్న సరదా పెరిగిపోవడంతో వివిధ మార్గాల్లో తుపాకులను కొనుగోలుచేసి రహస్యంగా కాల్పులు జరుపుతున్నారని అంటున్నారు. దాంతో, రాష్ట్రవ్యాప్తంగా అక్రమ తుపాకుల లెక్క తేల్చేందుకు మాజీ మావోయిస్టులు, జనశక్తి సభ్యుల ఇళ్లల్లో సోదాలకు సిద్ధమవుతున్నారు. గతంలో, మాజీ మావోయిస్టులు, జనశక్తి సభ్యుల నుంచి గన్స్‌, లోకల్ మేడ్ తుపాకులు, తపంచాలు స్వాధీనం చేసుకున్న సందర్భాలు ఉండటంతో ఆ దిశగా అప్రమత్తయ్యారు. అలాగే, లైసెన్స్ దారుల ఇళ్లల్లోనూ తనిఖీలకు పోలీసులు సిద్ధమవుతున్నారు.