తల్లిదండ్రుల్ని నిర్లక్ష్యం చేసినందుకు నాలుగేళ్లు జైలు శిక్ష.!!

జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని కంటికి రెప్పలా చూసుకుంటేనే ఆ జన్మకో అర్ధం ఉంటుంది. కానీ తల్లిదండ్రుల విలువ అర్ధం చేసుకోలేని కొందరు.. ఎదిగే వరకు తల్లిదండ్రుల నీడలో బ్రతుకుతారు.. ఎదిగాక వారిని దూరంగా ఉంచి పట్టించుకోవడం మానేస్తారు. అయితే అలాంటి వారి మీద చర్యలు తీసుకుంటే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతుంటారు. తాజాగా అలాంటి సంఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. తల్లిదండ్రుల్ని పట్టించుకోని కుమారుడుకి కోర్టు నాలుగేళ్లు జైలు శిక్ష విధించింది.

 

 


అహ్మదాబాద్‌కు చెందిన రాంఛోద్‌భాయ్ సోలంకి, జసుమంతి సోలంకికి ఇద్దరు కుమారులు. వృద్ధాప్యంలో ఉన్న ఆ దంపతులకు కొడుకులతో వివాదం నడుస్తోంది. ఇద్దరు కుమారులు తల్లిదండ్రుల్ని పట్టించుకోకపోవడంతో.. తప్పనిసరి  పరిస్థితుల్లో 2013లో ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. కొడుకుల నుంచి తమకు ప్రతి నెలా కొంత డబ్బు అందేలా చూడాలని కోరారు. ఆ దంపతుల కష్టాలను చూసిన కోర్టు.. ప్రతి నెలా తల్లిదండ్రులకు ఒక్కొక్కరు రూ.900 చొప్పున ఇవ్వాలని ఆదేశించింది. అప్పటి నుంచి మొదటి కుమారుడు దయాభాయ్ మాత్రం ప్రతి నెలా తల్లిదండ్రులకు డబ్బు చెల్లిస్తున్నాడు. రెండో కుమారుడు కాంతి భాయ్ మాత్రం సరిగా డబ్బు ఇవ్వడం లేదు. రెండో కుమారుడి నుంచి డబ్బు సరిగా అందకపోవడంతో.. ఆ దంపతులు మళ్లీ 2015లో కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు ఏప్రిల్‌లోనే నాలుగేళ్లు జైలు శిక్ష విధించాలని కోర్టు నోటీసులు పంపిందట. కానీ అరెస్ట్ వారెంట్ మాత్రం రాలేదట. ఆ తర్వాత కూడా అతడు డబ్బు చెల్లించకపోవడంతో శిక్షను ఖరారు చేసింది. మొత్తానికి కోర్టు ఇచ్చిన ఈ సంచలన తీర్పు తల్లిదండ్రుల్ని పట్టించుకోని పిల్లలకు గట్టి సంకేతాలు పంపిందనే చెప్పాలి.