గుజరాత్ ఎన్నికల ప్రభావం ఎవరిపై ఎలాగ ఉంటుంది?

 

ఈనెల 20వ తేదిన ఇద్దరు ప్రముఖరాజకీయ నాయకుల భవితవ్యం తేలనుంది. ఒకరు గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ కాగా, మరొకరు భావిభారత ప్రధాని కావాలని సర్వంసిద్దం చేసుకొని ఎదురుచూస్తున్న రాహుల్ గాంధీ. ఈనెల 20వ తేదిన వెలువడే గుజరాత్ ఎన్నికల ఫలితాలు కేవలం గుజరాత్ రాష్ట్రానికే పరిమితమయినవి కాబోవు. వాటి ఫలితాలు డిల్లీ వరకు ప్రభావం చూపించబోతున్నాయి. ఏవిదంగా అంటే, ఈ ఎన్నికలలో నెగ్గినవారికి డిల్లీ దర్బార్ ఎర్ర తివాచి పరిచి ఆహ్వానం పలబోతుంటే, ఓడినవారికి ఆ సదవకాశం కోల్పోవచ్చును.

 

ఉత్తర ప్రదేశ్ మరియు బీహార్ రాష్ట్రాలో జరిగిన ఎన్నికలకి సారద్యం వహించిన రాహుల్ గాంధీ అక్కడ ఓటమి చవిచుసాక, ఏంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేస్తున్న ఎన్నికలివి. అందువల్ల, ఇక్కడ గెలవడం అతనికి ఏంతో అవసరం. లేదంటే, అది అతని రాజకీయ భవిష్యత్ పై ప్రతికూల ప్రభావం చూపించే అవకాశాలు ఎంతయినా ఉన్నాయి. ఈ గుజరాత్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గానీ గెలిస్తే, అతనికి మళ్ళీ ఆత్మవిశ్వాసం పెరిగి, కొత్త ఉత్సాహం ఏర్పడుతుంది. గుజరాత్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలిచినా లేక కనీసం సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగినా ఆ కీర్తి అంతా ఆటోమేటిక్ గా అతని ఖాతలోనే జమ చేయబడుతుంది. అప్పుడు, అతను ‘ప్రధానమంత్రి పదవి రేసులో’ మొదటి ‘హర్డిల్’ దాటినట్లే అనుకోవచ్చును. అంతే గాక, అతను ప్రధానపదవికి ఎంట్రాన్స్ పరీక్ష పాస్ అయినట్లే అనుకోవచ్చును. గానీ, అది అతని ప్రధాన అర్హత ఎంతమాత్రం కాబోదు. ఎందుకంటే, అందరికి తెలిసిన విషయమే, అతని ప్రధానఅర్హత ‘సోనియా గాంధీ కొడుకు’ అనే హోదా వల్లవచ్చిందే తప్ప, అతని అనుభవం లేదా తెలివితేటలు వగైరాల వల్ల వచ్చినది మాత్రం కాదు. అందువల్ల, ఈ ఎన్నికలలో గెలుపు అతనికి కేవలం ఒక అదనపు అర్హతని ఇచ్చి, ప్రధానమంత్రి పదవి మరికొంత సౌకర్యంగా అందుకొనే వీలుకల్పిస్తుంది.

 

ఒకవేళ, ఈ ఎన్నికలలో గానీ (అతను సారద్యం వహించిన) కాంగ్రేసు పార్టీ ఓడిపోయినట్లయితే, తరువాత రాబోతున్న సాధారణ ఎన్నికల బాద్యతలు తీసుకోవడానికి అతనికి జంకు యేర్పడవచ్చను. మూడు వరుస పరాజయాలకి బాద్యతవహించిన రాహుల్ గాంధీ చేతిలో మళ్ళీ వచ్చేసాధారణ ఎన్నికల సారద్య బాద్యతలు కూడా పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ ఒకటికి రెండు సార్లు ఆలోచించవలసి ఉంటుంది.

 

“ఒక మారుమూల రాష్ట్రంలోనే పార్టీని గెలిపించలేక పోయినవాడు, రేపు దేశం మొత్తం మీద జరిగే ఎన్నికలలో పార్టీని ఏవిదంగా గెలిపించగలడూ?” అని గాని కాంగ్రెస్ పార్టీ నిర్మొహమాటంగా ఆలోచన చేసినట్లయితే, ఖచ్చితంగా అతనికి బాద్యతలు అప్పగించదు. ఒకవేళ, అప్పగించినట్లయితే, అది తన చరిత్రలోనే అతిపెద్ద రిస్కుకి సిద్దపడి ఇచ్చిందని భావించాల్సి ఉంటుంది.

 

అప్పుడు కూడా కాంగ్రెస్పార్టీ మెజార్టీ సాదించలేక చతికిలబడితే, సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయవలసి వస్తే భావిభారత ప్రధాని కావలనుకొంటున్నరాహుల్ గాంధీకి చాల ఇబ్బందికరమయిన పరిస్తితి ఏర్పడవచ్చును, గానీ, భజనపరులతో నిండిన కాంగ్రెస్ పార్టీలో అతను ప్రధానిపదవి చెప్పటడం పెద్ద అసాద్యమయిన పనిమాత్రం కాదు. సిగ్గువిడిచయినా సరే, ఆ పదవిచేపడుదామని అతను గానీ అనుకొంటే చాలు, పార్టీలో అన్నిద్వారాలు వాటంత అవే తెరుచుకుపోయి అతనికి స్వాగతం చెపుతాయి. ముందే అనుకొనట్లుగా అతని దక్షత, అనుభవం వంటివి కాక ‘సోనియాగాంధీ కుమారుడు హోదా’లోనే అది సాద్యం అవుతుంది.

 

ఇక, నరేంద్ర మోడీ ఈ ఎన్నికలలో విజయం సాదిస్తే, అతను గుజరాత్ లో తిరుగులేని నాయకుడిగా తనను తానూ మరోమారు నిరూపించుకోవడమే గాకుండా, బిజెపి తరపున ప్రధానమంత్రి అభ్యర్దిగా జాతీయస్థాయికి ఎదిగే అవకాశం కూడా పొందుతాడు. తద్వారా, మళ్ళీ రాహుల్ గాంధీకి మరోమారు జాతీయ స్థాయిలోకూడా సవాలుగా మారుతాడు.

 

అయితే, మోడీ రాష్ట్రంలో పొందుతున్న మద్దత్తు దేశవ్యాప్తంగా పొందగాలుగుతాడా లేదా అనేది మాత్రం ఇప్పుడే ఊహించలేము. ఒక వేళ పొందితే, ఇప్పుడు గుజరాత్ రాష్ట్రంలో ‘తానే పార్టీ, పార్టీయే తానూ’ అన్నరీతిలో సాగుతున్న అతను జాతీయస్థాయిలో కూడా అదేరీతిలో చక్రంతిప్పే ప్రయత్నం చేయవచ్చును. బిజెపి అగ్ర నాయకత్వం తన అభిజాత్యాన్ని పక్కన బెట్టి అతనికి పార్టీ పగ్గాలు అప్ప్గగించగలిగితే, అప్పుడు అతను పార్టీకి పునర్ వైభవం తెచ్చే అవకాశం కూడా ఉంది. అంతేగాకుండా, పార్టీని దేశవ్యాప్తంగా విస్తరింపజేసి, ఉత్తర దక్షిణ భారతంలో రెండుచోట్ల కూడా పార్టీకి అధికారం తెచ్చిపెట్టవచ్చును. గానీ, ఈ లెక్కలన్నీ బిజెపి వచ్చే సాదారణ ఎన్నికలో మెజారిటీ సాదించగలిగితేనే వేసినవి మాత్రమే. ఒకవేళ యన్.డి.యే. సంకీర్ణం ఏర్పాటు చేయ వలసి వస్తే, అప్పుడు లెక్కలు వేరేవిదంగా ఉండవచ్చును. యన్.డి.యే. లో అతను తనకు అనుకూలంగా ఎందరిని తిప్పుకోగాలడనే దానిపై అతని ప్రధానమంత్రి పదవి అధిష్టించే అవకాశాలు ఆదారపడి ఉంటాయి.

 

ఇక, నరేంద్ర మోడీ గుజరాత్ లో ఓడిపోయినా లేక గుజరాత్ లో సంకీర్ణం వచ్చినా అతని ప్రభావం కొంతమేర తగ్గవచ్చును. అతను గెలవలేకపోయినా కూడా, కాంగ్రెస్ ఒంటరిగా గెలిచే అవకాశం కూడా ఎంతమాత్రంలేనట్లు కనిపిస్తోంది కనుక, గుజరాత్ లో కేషుభాయి పటేల్ తో కలిసి కాంగ్రెస్ సంకీర్ణప్రభుత్వం ఏర్పాటుచేస్తే అది విచ్చినం అయ్యేవరకు మోడీ తీవ్రంగాశ్రమించి, మళ్ళీ అధికారం కైవసం చేసుకోవచ్చును. అక్కడ అతని ఓటమి, అతనికి డిల్లీ తలుపులు మూసివేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే, అతని నియంత్రత్వ ధోరణి నచ్చని వారు బిజెపిలో చాలమందే ఉన్నారు. అతను గుజరాత్లో ఓడినట్లయితే, అతను డిల్లీకి రాకుండా ఆపేందుకు అటువంటివారు విశ్వప్రయత్నం చేయక మానరు. అయినా, గుజరాత్ లో ఓడిన మోడీ, ముందు మళ్ళీ గుజరాత్ లోనే పోగోట్టుకొన్న తన అధికారాన్ని దక్కించుకోవాలని తాపత్రయపడతాడు గానీ, డిల్లీ వెళ్లాలని అనుకోడు కదా!

 

అందువల్ల, గుజరాత్ ఎన్నికలు అతనికి చాలా కీలకమే. ప్రస్తుతం గుజరాత్ ఎన్నికలలో కాంగ్రెస్, బిజెపిపార్టీల మద్య యుద్ధం జరుగుతున్నట్లు పైకి కనిపిస్తున్నా, అది నిజానికి రాహుల్ గాంధీకీ నరేంద్రమోడికీ మద్య జరుగుతున్న బీకరపోరు మాత్రమే. ఇద్దరు ప్రధానమంత్రి అభ్యర్దుల రాజకీయ భవిష్యత్ నిర్నయించే నిర్ణయాత్మకమయిన యుద్ధం గుజరాత్ ఎన్నికలు గనుక దాని ఫలితాలు వారిద్దరికీ చాల కీలకమే కానున్నాయి.