చంద్రబాబు పై మండిపడ్డ అమర్ నాధ్...

శాసన మండలిలో సంఖ్యా బలం ఉందన్న కారణంతో చంద్రబాబు డిక్టేటర్ లా వ్యవహరించారని వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాథ్ ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఆయన మండిపడ్డారు. ప్రజల ఆకాంక్షల్ని అడ్డుకునేలా 154 ప్రకారం సెలెక్ట్ కమిటీకి పంపేలా చూశారని ఆరోపించారు. మండలి పరిణామాల్ని ప్రతి ఒక్కరూ బ్లాక్ డేగా పరిగణిస్తున్నారన్నారు.నేడు చట్టాలను, చట్టసభలను అతిక్రమించి నేరుగా సీట్ నే డిక్టేట్ చేసేటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు ఉన్నారంటే, ఆయన మేనేజ్ మెంట్ ఏరకంగా చేస్తున్నారన్న అంశాన్ని రాష్ట్ర ప్రజలు గమనించాలని గుడివాడ అమర్ నాథ్ కోరారు.

ఇలాంటి ప్రవర్తనతో వారు ఏమైన విజయం సాధించారా అంటే.., మాహా అయితే మూడు నెలలో, నాలుగు నెలలో ఆలస్యవుతోంది తప్ప ఏం జరగదన్నారు. అమరావతి పరిరక్షణ కమిటీ ద్వారా ఆయన రాజకీయ ప్రయోజనాల కోసం జనాలను వాడుకోవాలని తప్ప మరే ప్రజాలబ్ధి లేదని అమర్ నాధ్ వెల్లడించారు. దీని కోసం ఏదో విజయం సాధించినట్టు, పక్క దేశం మీద యుద్ధం గెలిచి వస్తే సైనికులకు ఏరకంగా బ్రహ్మరధం పడతామో ఆ రకంగా ఆయన రోడ్లు ఎక్కడం, ఆయన మీద పూలవర్షం కురిపించుకోవడం, క్షీరాభిషేకాలు చేయించుకోవడం ఏంటని ఎద్దేవా చేసారు. మొన్న జరిగినటువంటి ప్రజాస్వామ్య ఖూనీని మీరు విజయంగా భావిస్తున్నారా అని అమర్ నాథ్ మండిపడ్డారు.