పంజాబ్ స్వర్ణదేవాలయంలో ఉద్రిక్తత!

 

 

 

స్వర్ణ దేవాలయంలో ఆపరేషన్‌ బ్లూస్టార్‌ జరిగి 30 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయంలో నివాళి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రెండు సిక్కు వర్గాలయిన సిక్‌ రాడికల్‌ గ్రూపు, శిరోమణి గురుద్వారా ప్రబంధ్‌ కమిటీ మధ్య జరిగిన ఘర్షణ స్వర్ణ దేవాలయంలో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడటానికి కారణమైంది. సిక్కులలోని రెండు వర్గాలు దేవాలయ ఆవరణలోనే కత్తులతో దాడులు చేసుకోవడంతో 12 మందికి గాయాలయ్యాయి. 1984 జూన్ నెలలోజరిగిన ఆపరేషన్ బ్లూస్టార్పై ఐక్యరాజ్యసమితితో విచారణ జరిపించాలనేది సిక్కు రాడికల్ గ్రూప్ డిమాండ్ కాగా, శిరోమణి గురుద్వారా ప్రబంధ్ కమిటీ దీనిని వ్యతిరేకిస్తోంది. ఈ విషయంలోనే రెండు గ్రూపుల మధ్య గొడవ జరిగింది. ఆపరేషన్ బ్లూ స్టార్ మృతులకు నివాళి అర్పిస్తున్న సమయంలోనే రాడికల్‌ గ్రూపు సభ్యులు ఐక్యరాజ్య సమితి విచారణ జరిపించాలని నినాదాలు చేశారు. ఇక్కడ గొడవ ప్రారంభమైంది. మాటామాటా పెరిగి గునపాలు, కత్తులతో దాడి చేసుకున్నారు. వివాదాన్ని నివారించడానికి సిక్కు మతపెద్దలు ప్రయత్నించారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.