జగన్ కు కొత్త తలనొప్పులు.. ఇలాగైతే లోకల్ వార్ లో గెలుపు కష్టమే..!

ముఖ్యమంత్రి జగనేమో మేనిఫెస్టో, నవరత్నాలూ అంటూ ఒక్కోటి అమలు చేసుకుంటూ ముందుకు పోతున్నారు. మరోవైపు, స్థానిక ఎన్నికలకు సమాయత్తం కావాలని ప్రజాప్రతినిధులకు, ముఖ్యనేతలకు ఆదేశాలిస్తున్నారు. కానీ, జగన్ ఒకటి తలిస్తే, నియోజకవర్గాల్లో మరొకటి జరుగుతోందంటున్నారు. జగన్ పాలనలో బిజీగా ఉంటే, వైసీపీ నేతలు మాత్రం ఆధిపత్య పోరు కోల్డ్‌వార్ తో, జగన్‌కు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నారు. ఒకట్రెండు జిల్లాలు, మొత్తం అన్ని జిల్లాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి కనిపిస్తోంది.

గుంటూరు జిల్లాలో అనేక మంది ప్రజాప్రతినిధుల మధ్య నిప్పులేకుండానే తగలపడేంతగా విభేదాలు రాజుకున్నాయి. గతంలో తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి, ఎంపీ నందిగం సురేష్‌ మధ్య విభేదాలు సీఎం వరకూ వెళ్లాయి. తాజాగా నరసరావుపేట ఎంపీ, ఆ పరిధిలోని మహిళ ఎమ్మెల్యే మధ్య విభేదాలు రచ్చరచ్చయ్యాయి. పార్టీ పెద్దలు నచ్చజెప్పడంతో అప్పటికప్పుడు సైలెంటయినా, లోలోపల వారిద్దరూ ఇంకా రగిలిపోతూనే వున్నారన్న చర్చ జరుగుతోంది. ఇక, తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో తోట త్రిమూర్తులు, ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. అలాగే, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి, ఎమ్మెల్యేలకీ మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఇక, కర్నూలులోనైతే, కోల్డ్‌వార్‌ ఇంకో రేంజ్‌లో ఉంది. ఎమ్మెల్యే హఫీజ్‌ ఖాన్, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌ రెడ్డి మధ్య నువ్వానేనా అన్నట్టుగా యుద్ధం సాగుతోంది. సెగ్మెంట్‌లో నువ్వన్నా ఉండాలి, నేనైనా ఉండాలన్న స్థాయిలో ఇరువురి మధ్య పోరు నడుస్తోంది. దాంతో వీరిద్దరి పంచాయతీ కూడా సీఎం జగన్‌ దగ్గరకు వెళ్లింది. ఇలా, ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గంలో ముఖ్యనేతలు, ప్రజాప్రతినిధుల మధ్య విబేధాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. నేతల విభేదాలతో కార్యకర్తలు సైతం వర్గాలుగా విడిపోతున్నారు. 

ఒకవైపు ముఖ్యమంత్రి జగనేమో, స్థానిక ఎన్నికల కోసం నేతలందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఆదేశాలిస్తున్నారు. కానీ నేతలేమో బాహాటంగానే తమ విభేదాలను ప్రదర్శిస్తున్నారు. అయితే, ఈ విభేదాలు మొత్తం పార్టీకే ఇబ్బందికరంగా మారుతున్నాయని, వచ్చే లోకల్‌ ఎలక్షన్స్‌లో ప్రభావితం చేస్తాయని కార్యకర్తలు, పార్టీ అగ్రనేతలు టెన్షన్‌ పడుతున్నారు.