జూపల్లి తీరుపై కేసీఆర్ సీరియస్... పార్టీ నుంచి సస్పెండ్!!

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు అధికార పార్టీ టీఆర్ఎస్ లో చిచ్చు రాజేస్తున్నాయి. ముఖ్యంగా మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు తీరు వివాదాస్పదంగా మారింది. పార్టీ అధిష్టానం ఆదేశాలకు వ్యతిరేకంగా ఆయన ఇండిపెండెంట్లను బరిలోకి దింపారు. కొల్లాపూర్ మున్సిపల్ ఎన్నికల్లో 20 మంది ఇండిపెండెంట్లుగా బరిలోకి దిగారు. వీరంతా జూపల్లి వర్గమని తెలుస్తోంది. అంతేకాదు, జూపల్లి నిలబెట్టిన అభ్యుర్థులకే ఓట్లు వేయాలంటూ ఆయన అనుచరులు పెద్ద ఎత్తున ప్రచారం కూడా నిర్వహిస్తున్నారు. 20 వార్డుల్లో జూపల్లి వర్గీయులు ఆలిండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీ అభ్యర్థులుగా బరిలో నిలిచారు. జూపల్లి ఫొటోలతో కూడిన ఫ్లెక్సీలు, ప్రచార రథాలతో సందడి చేస్తున్నారు.  దీంతో కొల్లాపూర్‌ మున్సిపాలిటీలో.. టీఆర్‌ఎస్‌లోని ఇరువర్గాల మధ్యనే ప్రధాన పోటీ నెలకొంది.

కొల్లాపూర్‌ పట్టణంపై ఆధిపత్యం సాధించేందుకు స్థానిక ఎమ్మెల్యే, మాజీమంత్రి ఇరువురు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. అయితే ఈ టీఆర్ఎస్ నేతల వర్గపోరు తమకు కలిసి వస్తుందని కాంగ్రెస్, బీజేపీ భావిస్తున్నాయి. మరోవైపు జూపల్లి తీరుపై టీఆర్ఎస్ అధిష్టానం ఆగ్రహంగా ఉంది. ఆయనపై అధిష్టానం చర్యలు తీసుకునే అవకాశముందని అంటున్నారు. ఆయనను పార్టీ నుండి సస్పెండ్ చేసినా ఆశ్చర్యం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.