గుంటూరు వైసీపీలో భగ్గుమన్న విభేదాలు.. మరో ఎంపీ, ఎమ్మెల్యే మధ్య వర్గపోరు

గుంటూరు జిల్లా వైసీపీలో విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. జిల్లాల్లో ఇప్పటికే ఉప్పు నిప్పుగా ఉంటున్న నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు, చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనీ అనుచరులు ఒక్కసారిగా బాహాబాహీకి దిగారు. దీంతో పోలీసులు వారికి సర్దిచెప్పి ఎంపీని అక్కడి నుంచి పంపించారు. మహాశివరాత్రి సందర్భంగా ఎంపీ కృష్ణదేవరాయలు చిలకలూరి పేటలోని పురుషోత్తపట్నంలో జరిగిన ఓ కార్యక్రమానికి ఎమ్మెల్యే రజనీకి సమాచారం ఇవ్వకుండా రావడమే దీనికి అసలు కారణం.

గుంటూరు జిల్లాలో వైసీపీ తరఫున గెలిచిన నేతలంతా దాదాపు కొత్తవారే కావడంతో వారి మధ్య సఖ్యత కుదరడం లేదు. గతంలో ఇసుక అక్రమ తవ్వకాలు, తరలింపు నేపథ్యంలో బాపట్ల ఎంపీ నందిగం సురేష్ వైఖరిని నిరసిస్తూ తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఆందోళనకు దిగారు. ఈ వివాదం సీఎం జగన్ వద్దకు వెళ్లడం, ఇద్దరినీ పిలిపించి మాట్లాడటంతో పరిస్ధితి సద్దుమణిగింది. తాజాగా బుధవారం రాత్రి చిలకలూరిపేటలోని పురుషోత్తపట్నంలో మహాశివరాత్రి సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రభ వద్దకు నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు వచ్చారు. స్ధానిక నేతల ఆహ్వానం మేరకు అక్కడికి వచ్చిన ఎంపీ కృష్ణదేవరాయలను స్ధానిక ఎమ్మెల్యే విడదల రజనీ అనుచరులు అడ్డుకున్నారు. ఇద్దరూ అధికార పార్టీ నేతలు కావడం, గతంలోనూ వీరిద్దరి మధ్య ప్రోటోకాల్ విషయంలో పలు వివాదాలు తలెత్తడం జరిగింది. దీంతో ఒకరంటే మరొకరికి పడటం లేదు.

స్ధానికంగా ఉన్న సంఘమిత్ర ఇంటికి వచ్చిన ఎంపీ కారును ఎమ్మెల్యే వర్గీయులు అడ్డగించారు. ఎంపీ అనుచరులు కూడా దీన్ని వ్యతిరేకిస్తూ వాగ్వాదానికి దిగారు. ఇది కాస్తా ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. తోపులాటలో ఓ వ్యక్తి తలకు గాయాలు కూడా అయ్యాయి. పరిస్ధితి ముదరడంతో పోలీసులు జోక్యం చేసుకుని ఎంపీ కృష్ణదేవరాయలను అక్కడి నుంచి పంపించేశారు. దీంతో పరిస్ధితి సద్దుమణిగింది. స్ధానిక ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వకుండా నియోజకవర్గంలో ఎలా పర్యటిస్తారనేది ఎమ్మెల్యే రజనీ అనుచరుల వాదన కాగా... ఎంపీగా తమ నియోజకవర్గం పరిధిలో ఎక్కడైనా పర్యటించే హక్కు తనకుందనేది ఎంపీ కృష్ణదేవరాయలు వాదన. అయితే వీరిద్దరి మధ్య గతంలో ఉన్న ఆధిపత్య పోరు కారణంగానే తాజా వివాదం తలెత్తిందని జిల్లా వైసీపీ నేతలు చెబుతున్నారు.

వాస్తవానికి విడదల రజనీకి వైసీపీ అధిష్టానం పెద్దల ఆశీస్సులున్నాయి. గతంలో వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న మర్రి రాజశేఖర్ ను కాదని గత ఎన్నికల్లో జగన్ రజనీకి టికెట్ కేటాయించారు. అప్పటికే నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న ప్రత్తిపాటి పుల్లారావుపై ఆమె సునాయాసంగానే విజయం సాధించారు. ఆర్ధికంగా బలమైన నేత కావడంతో పాటు బీసీ సామాజికవర్గానికి చెందిన మహిళ కావడం ఆమెకు కలిసివచ్చాయి. అయితే తనకున్న అనుకూలతలను వాడుకుండూ ఎంపీ లావు కృష్ణదేవరాయలను తన నియోజకవర్గంలో అడుగుపెట్టనీయకుండా రజనీ కొంతకాలంగా అడ్డుకుంటున్నారు. ఈ వ్యవహారంపై ఆయన అధిష్టానం పెద్దలకు గతంలో ఫిర్యాదు కూడా చేసినట్లు తెలుస్తోంది. అయినా వారి నుంచి స్పందన రాకపోవడంతో తన పని తాను చేసుకుపోవాలని భావిస్తున్న ఎంపీ లావు యథావిథిగా నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. అదే కోవలో చిలకలూరిపేట రావడంతో వివాదం తలెత్తింది. తాజా వివాదంపై ఇరువర్గాలు వైసీపీ పెద్దలకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.