అంతకన్నా ఎక్కువ డ్రా చేస్తే టాక్స్.. మోదీ సర్కార్ బాదుడు షురూ!

 

నల్లధనాన్ని అరికట్టడంతో పాటు డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోనుంది. ఏడాదికి రూ.10 లక్షల కన్నా ఎక్కువ నగదు విత్ డ్రా చేస్తే పన్ను విధించేందుకు సమాయత్తమవుతున్నట్లు తెలుస్తోంది. అంతేగాక.. ట్యాక్స్ రిటర్నులకు ఉపయోగపడేందుకు వీలుగా ఎక్కువ మొత్తంలో లావాదేవీలకు ఆధార్ ను అనుసంధానం చేసేలా నిబంధన తీసుకురావాలని కూడా యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రూ.50వేల కంటే ఎక్కువ లావాదేవీలకు బ్యాంకులు PAN నంబరును అడుగుతున్నాయి. దాని స్థానంలో ఆధార్ నంబర్‌ను తీసుకువచ్చే అవకాశం ఉంది.

కాగా.. దశాబ్దం క్రితం యూపీఏ ప్రభుత్వం కూడా ఇలాంటి ఓ నిర్ణయం తీసుకుంది. బ్యాంకులో నగదు లావాదేవీలపై పన్నులు ప్రవేశపెట్టింది. అయితే దానిపై పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో కొన్నేళ్ల తర్వాత ఆ పన్నులను ఎత్తివేసింది. యూపీఏ ప్రభుత్వం 2005లో ప్రవేశపెట్టి 2009లో తీసేసిన ఈ బ్యాంకింగ్ క్యాష్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్(బీసీటీటీ)ని మళ్లీ తీసుకొచ్చేందుకు ప్రభుత్వం యోచిస్తోందని సమాచారం. ఇక అన్నింటి కంటే కీలకమైనదంటంటే.. అత్యధికంగా ట్యాక్స్ కట్టే వ్యక్తులు ప్రధాని మోదీతో చాయ్ తాగే అవకాశం కల్పించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.