అధిక చార్జీలు వసూలు చేయవద్దు

నాణ్యమైన చికిత్సతో రోగులకు భరోసా కల్పించాలి..
బాధ్యతతో టెస్టులు చేయాలి..
అధిక చార్జీలు వసూలు చేయవద్దు..
ప్రైవేటు, కార్పోరేటు హాస్పిటల్స్ యాజమాన్యంతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన గవర్నర్ తమిళ సై..
వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న 11 హాస్పిటల్స్..

కరోనా నియంత్రణ, చికిత్స పై ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేసింది అంటూ ప్రజలు నేరుగా రాష్ట్ర గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. ట్విట్టర్లో అనేకమంది గవర్నర్ తమిళసై సౌందర రాజన్ దృష్టికి ప్రభుత్వ తీరు, ప్రైవేటు హాస్పిటల్స్  అధిక ఫీజులు వసూలు చేస్తున్న విషయాలను తీసుకువెళ్లారు. దాంతో ఆమె నగరంలోని ప్రైవేట్ హాస్పిటల్స్ యాజమాన్యాల తో రాజ్ భవన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా పాజిటివ్ రోగులను చేర్చుకోవడం లేదన్న విషయం పై ఆమె వివరణ కోరారు. అధిక ఫీజులు వసూలు చేయడం సరికాదని, కరోనా విజృంబిస్తున్న తరుణంలో మానవత్వంతో వ్యవహరించాలని, రోగులకు మెరుగైన చికిత్స అందించాల్సిన బాధ్యతను గుర్తించాలన్నారు. బెడ్స్ కు కొరత ఉంటే హాస్పిటల్స్ కు అనుబంధంగా ఉన్న వైద్య కళాశాలలను వినియోగించుకోవాలని గవర్నర్ సూచించారు.

కరోనా పాజిటివ్ రోగులొస్తే కచ్చితంగా చేర్చుకుని మెరుగైన చికిత్స అందించాలని హాస్పిటల్స్ యాజమాన్యాలకు తేల్చి చెప్పారు. నాణ్యమైన చికిత్సతో రోగులకు భరోసా కల్పించాలన్నారు. కరోనా కల్లోలంతో ప్రజల్లో భయాందోళనలు పెరిగిపోతున్న కారణంగా ప్రైవేట్ హాస్పిటల్స్ కు వచ్చే రోగుల పట్ల మానవత్వంతో చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని యాజమాన్యాలకు సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పేషేంట్స్ నుండి అధిక చార్జీలు వసూలు చేయకూడదని గవర్నర్ తమిళ సై స్పష్టం చేశారు.