ఢిల్లీ లో గవర్నర్, సిఎం, బొత్స

 

 

 

తెలంగాణా ఫై అఖిల పక్ష సమావేశం తేదీ సమీపిస్తుండటంతో కాంగ్రెస్ లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ప్రస్తుతం గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యానారాయణ ఢిల్లీ లో మకాం వేసారు. ఈ ముగ్గురు కీలక వ్యక్తులు ఒకే సారి రాజధానిలో ఉండటం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.

 

తెలంగాణాకు తాము వ్యతిరేకం కాదని రాష్ట్రంలోని దాదాపు అన్ని రాజకీయ పార్టీలు ఇప్పటికే ప్రకటించాయి. అయితే, కేంద్రంలోనూ, రాష్ట్రంలోను అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇప్పటివరకూ ఈ విషయంలో ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించలేదు. దీనితో ఆ పార్టీ ఫై వత్తిడి పెరిగింది. 28 కి ముందే ఈ విషయంలో ఓ అభిప్రాయానికి వచ్చేందుకు ఆ పార్టీ కసరత్తు చేస్తోంది. ఆ సమావేశంలో అనుసరించాల్సిన వైఖరిపై కూడా త్వరలో నిర్ణయం తీసుకోవాలని పార్టీ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో, ధర్మాన అంశం వంటి పార్టీ అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది.

 

ఇప్పటికే పార్టీ సీనియర్ నేతలు రాహుల్ గాంధీ తో చర్చలు జరిపినట్లు తెలిసింది. తెలంగాణా ఫై సత్వర నిర్ణయం తీసుకోవాల్సిన అవసరాన్ని కూడా వారు రాహుల్ కు వివరించినట్లు తెలిసింది. ప్రత్యేక రాష్ట్రమా, ప్యాకేజీనా అనే అంశాలు కూడా పార్టీ అధిష్టానం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ రాత్రికి గవర్నర్, సోనియా, మన్మోహన్ లతో సమావేశం కానున్నారు.