ఉగ్ర నరసింహన్..రెండో వైపు చూడొద్దు

 


"నాన్నా.. సింహం.. సింగిల్ గానే వస్తుంది. పందులే గుంపులు గుంపులుగా వస్తాయి" అని రజనీ కాంత్ సినిమాలో బాగా క్లిక్ అయిన డైలాగ్ ఒకటుంది. రాష్ట్రపతి పాలన విధించిన తర్వాత గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ విషయంలో ఇది అక్షరాలా నిజమైంది.  రాష్ట్ర పరిపాలనపై గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్ ముద్ర రెండో రోజు నుంచే స్పష్టంగా కనిపించింది.

 

కిరణ్‌కుమార్‌రెడ్డి నామినేట్ చేసిన పదవుల్లోని వారిపైనా గవర్నర్ దృష్టి సారించారు. రాజ్యాంగ, చట్టబద్ధత కాని నామినేటెడ్ పోస్టుల్లో ఉన్న వారి జాబితాలను పంపాలని గవర్నర్ కార్యాలయం నుంచి అన్ని శాఖలకు నోట్ అందింది. దీంతో అన్ని శాఖలు తమ పరిధిలోని నామినేటెడ్ పోస్టుల్లో ఉన్న వారి జాబితాలను సిద్ధంచేసి పంపే పనిలో పడ్డాయి. ఈ దిశలోనే రాజీవ్ యువకిరణాల చైర్మన్‌ కె.సి.రెడ్డి సోమవారం రాజీనామా చేశారు. అడ్వకేట్ జనరల్ ఎ.సుదర్శన్‌రెడ్డి, ఆర్‌టీసీ చైర్మన్ ఎం.సత్యనారాయణరావు, 20 సూత్రాల పథకం అమలు చైర్మన్ తులసిరెడ్డిలతో పాటు ఇటీవల సీఎం పలు దేవాలయాలకు నియమించిన పాలక మండళ్ల చైర్మన్లు, ప్రెస్ అకాడమీ చైర్మన్‌తో పాటు ఇతర నామినేటెడ్ పదవుల్లో కొనసాగుతున్న వారినీ రాజీనామా చేయాల్సిందిగా గవర్నర్ కార్యాలయం ఆదేశించనున్నట్లు సమాచారం. తుడా, వీజీడీఎంఏ చైర్మన్ , పాలకమండళ్లను కూడా రాజీనామా చేయాల్సిందిగా ఆదేశించనున్నట్లు చెబుతున్నారు.


సీఎంగా కిరణ్ చివరి రోజుల్లో తీసుకున్న నిర్ణయాలపై వివరాలను పంపాలని గవర్నర్ కార్యాలయం నుంచి సీఎస్‌కు నోట్ అందింది. అయితే ఎప్పటి నుంచి తీసుకున్న నిర్ణయాలో ఆ నోట్‌లో పేర్కొనలేదు. దీంతో.. ఎప్పటినుంచి ఎప్పటివరకు తీసుకున్న నిర్ణయాల వివరాలను పంపాలో తెలియజేయాలని గవర్నర్ కార్యాలయాన్ని సీఎస్ కోరారు.


అనూహ్యంగా మొదలైన పెట్రోల్ బంకుల బంద్‌ను గంటల వ్యవధిలో ఆయన ఉపసంహరింపజేశారు. అంతకుముందు సమ్మె సాకుతో లీటరు పెట్రోలు ఏకంగా 220 వరకు అమ్ముడైంది. దీంతో గవర్నర్ నరసింహన్ జోక్యం చేసుకుని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో, తూనికలు, కొలతల డెరైక్టర్ జనరల్‌తో మాట్లాడారు. సాయంత్రానికల్లా పెట్రోల్ బంకులు తెరుచుకునేలా చర్యలు తీసుకోవాలని, లేదంటే చర్యలు తీవ్రంగా ఉంటాయనే సంకేతాలను గవర్నర్ ఇచ్చారు. దీంతో పెట్రోల్ బంకుల యజమాన్యాలతో అధికారులు చర్చలు జరిపారు. గంటల వ్యవధిలోనే బంద్‌ను యాజమాన్యాలు ఉపసంహరించుకున్నాయి. అంతేకాదు, సర్కారుతో కాళ్లబేరానికి కూడా వచ్చాయి.

ఇంతకాలంగా అందరూ గవర్నర్ ని ఒకవైపే చూసారు. రెండో వైపు చూడలేదు. చూస్తే తట్టుకోలేరని ఇప్పుడు ఉగ్ర నరసింహన్ స్పష్టం చేస్తున్నారు.