ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు సాధ్యమే

 

దేశం దాటి వెళ్లిన నల్ల ధనాన్ని భాజపా అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో స్వదేశానికి రప్పించి ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు జమ చేస్తామని 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రధాని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ హామీని ఇప్పటివరకూ నెరవేర్చకపోవడంతో ప్రతిపక్షాలు  ప్రభుత్వంపై రకరకాల విమర్శలు చేస్తున్నాయి. రూ.15 లక్షలు ప్రతి ఖాతాలో జమ చేస్తానన్న ప్రధాని.. ఇప్పటివరకూ ఆ పని ఎందుకు చేయలేకపోయారని ప్రశ్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ అంశంపై తాజాగా కేంద్ర సామాజిక న్యాయశాఖ మంత్రి రామ్‌దాస్‌ అథవాలే స్పందించారు. మహారాష్ట్రలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. ‘‘ప్రతి ఖాతాలో రూ.15 లక్షలు వేయడం అనేది ప్రజలకు నెమ్మదిగా చేరువవుతుంది. అయితే అంతా ఒకేసారి కుదురదు.. ప్రభుత్వం వద్ద అంత డబ్బు లేదు. నిధులు కావాలని ఆర్బీఐని అడిగాం. కానీ వారు ఇవ్వట్లేదు. అందువల్లే నిధులు సమకూర్చుకోలేకపోయాం. దీనిపై కొన్ని సాంకేతిక పరమైన సమస్యలున్నాయి.’’ అని రామ్‌దాస్‌ అథవాలే వ్యాఖ్యానించారు. రామ్‌దాస్‌ అథవాలే వ్యాఖ్యలపై నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు కూడా సాధించటం మొదలుపెట్టారు. అథవాలేను అర్జెంట్ గా కేంద్ర ఆర్థికమంత్రిగా గానీ… ఆర్బీఐ గవర్నర్ గా గానీ నియమించాలంటూ ఛలోక్తులు విసురుతున్నారు.