బీజేపీ నేతల అడుగులు మారనున్నాయా... వైసీపీలోకి గోకరాజు ఫ్యామిలీ!

 

బీజేపీ మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు కుటుంబం వైసీపీలో చేరబోతోంది అనే వార్త హల్ చల్ చేస్తొంది. విషయమేమిటంటే గంగరాజ్ చేరడం లేదు, ఆయన కుమారుడు రంగరాజు, గోకరాజు సోదరుడు నరసింహరాజు, రామరాజులు వైసీపీలో చేరుతున్నట్లు సమాచారం. రేపు సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వీరంతా వైసీపీలో చేరబోతున్నారు. ఇందుకు మధ్యాహ్నం ముహుర్తంగా నిర్ణయించారు. తన కుటుంబం వైసీపీ లోకి వెళ్లిన తాను మాత్రం బిజెపి లోనే ఉంటానని చెప్పారు గోకరాజు గంగ రాజు. 

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోకి వివిధ పార్టీల నుంచి వలసలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ నుంచి మొదలైన వలసలు ఇప్పుడు ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వైపు నుంచి కూడా మొదలయ్యాయి. బీజేపీ వైపు నుంచి వైసీపీ లోకి చేరటం ఊహించని పరిణామంగా చెప్పవచ్చు. ముఖ్యంగా గోకరాజు గంగ రాజులకు బిజెపిలో అత్యంత ప్రాధాన్యత ఉంది. వీహెచ్పీ తో సత్సంబంధాలు ఉన్న నేపథ్యంలో ఆయన కుమారుడితో పాటు కుటుంబం లోని అత్యంత సన్నిహితులు వైసీపీలో చేరడం పట్ల అనేక రాజకీయ చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా కేంద్రంలో బిజెపి, వైసీపీ మధ్య కొద్దిగ మనస్పర్ధ లు ఉన్న నేపథ్యంలో గోకరాజు గంగ రాజు కుటుంబం వైసీపీలో చేరడం వెనుక అనేక రాజకీయ కారణాలు కన్పిస్తున్నాయి. అయితే రేపు పార్టీలో చేరిన తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి బిజెపి వైపు నుంచి మొదటి వికెట్ గోకరాజు గంగ రాజు కుటుంబం రూపంలో వైసీపీలో చేరడం పై రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంటోంది. బీజేపీ నేతలు కూడా వేరే పార్టీ తీర్ధాలు పుచ్చుకోడానికి సిద్ధపడుతున్నారో లేదో వేచి చూడాలి.