దేశం గర్వించే స్థాయిలో గోదావరి పుష్కరాలు

 

దేశం గర్వించే స్థాయిలో గోదావరి పుష్కరాలు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఆదివారం నాడు ఆయన పుష్కరాల మీద సమీక్షా సమావేశం నిర్వహించారు. వచ్చే ఏడాది జూలై 14 నుంచి గోదావరి పుష్కరాలు జరుగనున్నాయి. ఈ డిసెంబర్ నుంచి అందుకు సంబంధించిన పనులు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఈ సందర్భంగా జరిగిన సమీక్షా సమావేశంలో మంత్రులు యనమల రామకృష్ణుడు, పీతల సుజాత, పలువురు అధికారులు పాల్గొన్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో ముందుగా శాశ్వత పనులపైనే దృష్టి సారించాలని, స్నానఘట్టాల అభివృద్ధితోపాటు రహదారుల ఏర్పాటు వంటి పనులకు సమగ్ర నివేదికలు, ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. మొత్తం 954 కోట్ల రూపాయల ఖర్చయ్యే ప్రతిపాదనలకు ఆర్థిక శాఖ సూత్రప్రాయంగా అంగీకారం తెలపడంతో చేపట్టాల్సిన పనులపై చర్చించారు.