సబ్బుబిళ్ళ.. కాదేదీ సమాజ సేవకి అనర్హం..

మనం వాడిపడేసే చిన్న సబ్బు బిళ్ళతో ఒక దేశంలోని ప్రజల ప్రాణాలు కాపాడచ్చు అంటే నమ్మగలరా. కానీ, ఇది నిజం, నమ్మితీరాలని నిరూపించాడు కయాన్గో అనే యువకుడు.

 

సాధారణంగా ఇళ్ళలో సబ్బు పూర్తిగా అయ్యేదాకా వాడం మనం. చేతికి చిక్కనంత చిన్నది కాగానే చెత్తలో పారేస్తాం. ఇక ఇక హోటల్ రూమ్స్‌లో పెట్టే రకరకాల సబ్బుల్ని ఆ హోటళ్ళలో దిగినవాళ్ళు తిరిగి కాళీ చేసేటప్పుడు అప్పటిదాకా వాడిన సబ్బుల్ని అక్కడే వదిలేసి వెళ్ళిపోతారు. సిబ్బంది వాటిని తీసి పడేస్తుంటారు. ఇంచుమించు అలా తీసి పడేసే సబ్బు బిళ్ళలు అమెరికాలో అయితే కొన్ని టన్నులు ఉంటాయట ఒక్క రోజుకే. సబ్బు ఖర్చు మనకి లెక్కలేదు. కానీ, ఉగాండాలో సబ్బు ఓ విలాసవస్తువు కిందే లెక్క. ఓ సబ్బు ఖర్చుతో ఓరోజు తిండి గడిచిపోతుంది అక్కడి సామాన్యుడికి. దాంతో సబ్బు వాడకం దాదాపు తక్కువ. దీనివల్ల అక్కడి పిల్లలు అంటురోగాల బారిన పడి మరణిస్తున్నారు.

ఇలాంటి పరిస్థితిని కళ్ళారా చూసిన ఉగాండా యువకుడు కయోన్గో ఉద్యోగం కోసం కెన్యా వలస వచ్చినప్పుడు సబ్బును ఇక్కడ ఎలా వృధాగా పారేస్తున్నారో చూసి బాధపడిపోయాడు. ఏదో ఒకటి చేసి అక్కడి అవసరాన్ని ఇక్కడి వృధాతో తీర్చాలనుకున్నాడు. అలా ‘గ్లోబల్ సోప్ ప్రాజెక్టు’ను ప్రారంభించాడు. ప్రాజెక్టు ద్వారా హోటళ్ళలో వృధాగా పడేసే సబ్బులను సేకరించి ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద వాటిని కరిగించి మళ్ళీ వాటిని కొత్త సబ్బులుగా తయారుచేస్తారు. ఆ సబ్బులను ఉగాండాలోని పేదవాళ్ళకి పంచుతారు. ఇలా కయెన్గో చేసిన చిన్న ప్రయత్నం అక్కడి పిల్లల ప్రాణాలు కాపాడింది. అపరిశుభ్రత వల్ల రోగాల బారిన పడి మరణించే పిల్లల సంఖ్య తగ్గింది.

ఒక్క యువకుడి చిన్న ప్రయత్నం వృధా అయిపోయే సబ్బులను ప్రాణాలు కాపాడేవాటిగా మార్చగలిగింది. ఆలోచించండి. మనదేశంలోనూ సబ్బుబిళ్ళకు నోచుకోని పేదవాళ్ళు ఎందరో. వృధాగే పడేసే సబ్బు బిళ్ళలూ కొన్ని టన్నులు వుంటాయి. మరి వాటిని అవసరమైన వారికి చేర్చేదెవరు. ఇవేకాదు... ఇలాంటి ఎన్నో చిన్న,పెద్ద అవసరాలు ఒకే ఒక్కరి ప్రయత్నంతో తీరతాయి. కావలసింది ఆలోచన - ఆచరణ. మరి ఆలోచించడం మొదలుపెట్టారా?

 

-రమ