డిసెంబర్ లోనే గ్రేటర్ పోల్? అందుకే హడావుడి.. 

గ్రేటర్ హైదరాబాద్ కార్పోరేషన్ ఎన్నికలు ముందే రాబోతున్నాయా? సిటీలో మున్సిపల్ మంత్రి కేటీఆర్ హడావుడి అందుకేనా? అంటే అవుననే తెలుస్తోంది. డిసెంబర్ లోనే జీహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయని సమాచారం. గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లతో సమావేశమైన మంత్రి కేటీఆర్.. ఇదే సంకేతమిచ్చారు. గ్రేటర్ ఎన్నికలు రెండు నెలల ముందే రావచ్చని అందరూ సిద్ధంగా ఉండాలని సూచించారు కేటీఆర్. ప్రస్తుత బల్దియా పాలకమండలి గడువు ఫిబ్రవరి వరకు ఉంది. అయితే రెండు నెలల ముందే ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. సంక్రాంతి లోపే అంటే డిసెంబర్ లోనే ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తుందట. 

 

మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఇటీవల గ్రేటర్ పై ఎక్కువ ఫోకస్ చేయడంతోనే ఎన్నికలు ముందే రాబోతున్నాయన్న ప్రచారం జరిగింది. అనుకున్నట్లుగానే ముందస్తు ఎన్నికలకు సర్కార్ సిద్ధమవుతోంది. గ్రేటర్ ఎన్నికలను ముందే నిర్ణయించాలని డిసైడయ్యాకే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా సీనియర్ ఐపీఎస్ పార్థసారథిని సర్కార్ సడెన్ గా నియమించినట్లు తెలుస్తోంది. కొత్తగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ప్రభుత్వ ఆదేశాలతో ఆయన యాక్షన్ లోకి దిగారు. గ్రేటర్ ఎన్నికల కసరత్తు ప్రారంభించారు పార్థసారథి. ఇటీవలే గ్రేటర్ అధికారులతో సమావేశమై ఎన్నికలపై చర్చించారు. వివిధ పార్టీల నేతలతోనూ మాట్లాడి వారి అభిప్రాయాలు తీసుకున్నారు. కరోనా ప్రభావం ఉన్నందున ఎలాంటి జాగ్రత్తలతో ఎన్నికలు నిర్వహించాలనే అంశంపైనా పార్థసారథి పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్నారు. 

 

గ్రేటర్ లోని పెండింగ్ పనులపై వరుసగా సమీక్షలు నిర్వహిస్తున్నారు మంత్రి కేటీఆర్. పనులు త్వరగా పూర్తి చేసేలా అధికారులను డెడ్ లైన్ పెట్టి పరుగులు పెట్టిస్తున్నారు. పూర్తైన వాటికి ప్రారంభోత్సవాలు, కొత్త అభివృద్ధి పనులకు శంకుస్థాపనలతో హడావుడి చేస్తున్నారు కేటీఆర్. కొత్తగా నిర్మించిన రోడ్లు, ప్లైఓవర్లను యుద్ధ ప్రాతిపదికన ప్రారంభిస్తున్నారు. దుర్గం చెరువుపై ప్రతిష్టాత్మంగా నిర్మించిన కేబుల్ బ్రిడ్జ్ ను ఇటీవలే ప్రారంభించారు. సిటీలో ప్రధాన రోడ్లకు లింకు కలుపుతూ వేసిన స్లిప్ రోడ్లను అందుబాటులోకి తెస్తున్నారు. కేటీఆర్ దూకుడుతో సిటీలో పెండింగ్ పనులు చకచకా జరుగుతున్నాయి. గ్రేటర్ లో సమస్యగా మారిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లపైనా కేటీఆర్ దృష్టి సారించారు. డిసెంబర్ లోగా 85 వేల డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పంపిణి చేయాలని హౌసింగ్ అధికారులకు డెడ్ లైన్ పెట్టారు మున్సిపల్ మంత్రి. 

 

ఇక గ్రేటర్ లో ఎమ్మెల్యేలు, కార్పొరేటర్ల సమావేశంలో కేటీఆర్ మరిన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. సిట్టింగ్ కార్పొరేటర్ల పనితీరుపై కేటీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. 15 మంది కార్పొరేటర్ల పనితీరుపై బాగోలేదన్న మంత్రి.. కార్పొరేటర్లు ఇకనైనా తీరు మార్చుకోవాలని హెచ్చరించారట. జిహెచ్ఎంసి పరిధిలో ఇన్ని రోజులుగా చేసిన కార్యక్రమాలను ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకుపోవాలని కార్పొరేటర్లకు పిలుపునిచ్చారు మంత్రి కేటీఆర్. అయితే జీహెచ్ఎంసీ కార్పొరేటర్లను ఉద్దేశించి కేటీఆర్ చేసిన కామెంట్లపై మరో చర్చ జరుగుతోంది. తాను చేయించిన సర్వేల్లో ప్రతికూల ఫలితాలు రావడం వల్లే కార్పొరేటర్లపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారని చెబుతున్నారు. ఫలితాలు తమకు అనుకూలంగా రాకపోతే .. కార్పొరేటర్లపై నెపం మోపవచ్చని గులాబీ పార్టీ ప్లాన్ చేస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

 

గ్రేటర్ హైదరాబాద్ లో ఇటీవల కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలు మునిగిపోయి. వరద రోడ్లను ముంచెత్తింది. నాలాలో పడి బాలిక, వరదలో గల్లంతై మరొకరు చనిపోయారు. బల్దియా పనితీరుపై సిటీ జనాల నుంచి ఆగ్రహం వ్యక్తమైంది. ఇక కార్పొరేటర్ల అక్రమ దందాలపైనా కేటీఆర్ కు  ఫిర్యాదులు వచ్చాయంటున్నారు. కార్పొరేటర్లు ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని కొందరు ఫిర్యాదు చేశారట. అందుకే ముందే అప్రత్తమై కేటీఆర్ వారికి వార్నింగ్ ఇచ్చినట్లు చెబుతున్నారు. గత ఐదు సంవత్సరాలుగా టీఆర్ఎస్ ప్రభుత్వం 67 వేల కోట్ల రూపాయలను హైదరాబాద్ లో వివిధ కార్యక్రమాల కోసం ఖర్చు చేసిందని చెప్పారట మంత్రి. వేల కోట్ల రూపాయలతో తాగునీటి ఇబ్బందులు తొలగించి, వందల కోట్ల రూపాయలతో రోడ్లను అభివృద్ధిపరచి , లక్షల కోట్ల పెట్టుబడులను హైదరాబాద్ కు రప్పించామని.. ఇదే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారని చెబుతున్నారు.