గెయిల్ గ్యాస్: ప్రాణాలు మనవి..లాభాలు వాళ్ళవా?

Publish Date:Jun 27, 2014

 

తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో మొత్తం శుక్రవారం ఉదయం ఉలిక్కిపడింది. ‘నగరం’ అనే గ్రామం కాస్తా క్షణాల్లో ‘నరకం’లా మారిపోయింది. భారత ప్రభుత్వానికి చెందిన గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా (గెయిల్)కి చెందిన గ్యాస్ పైపులైన్ ఒక్కసారిగా పేలడంతో 14 మంది స్థానికులు మంటల్లో మాడిపోయి మరణించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం వుందని అనుమానిస్తున్నారు. బ్లో ఔట్ తరహాలో 250 మీటర్ల ఎత్తుకు రేగిన మంటల ధాటికి నగరం గ్రామం మొత్తం అతలాకుతలం అయిపోయింది. వందలాది చెట్లు మాడిపోయాయి. పంటపొలాలు పొగచూరిపోయాయి. కోనసీమ ప్రాంతమంతా అనకొండాల తరహాలో గ్రామగ్రామాన వ్యాపించి వున్న గ్యాస్ పైపులైన్లు ఎప్పుడో ఒకసారి తమని మింగేస్తాయని ఈ ప్రాంత ప్రజలు నిరంతరం భయపడుతూనే వుంటారు. వారి భయానికి తగ్గట్టుగానే గ్యాస్ పైప్ లైన్లు తరచుగా బద్దలవుతూ కోనసీమ ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తూ వుంటాయి. ఇప్పుడు జరిగిన ఈ సంఘటన కోనసీమలో గ్యాస్ పైప్ లైన్ల వికృత రూపానికి నిదర్శనంగా నిలుస్తుంది. పాతికేళ్ళ క్రితం వేసిన పైపులు తుప్పుపట్టి పోయాయి. ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట గ్యాస్ లీక్ అవుతూనే వుంది. వాటిని నివారించండి మహాప్రభో అని స్థానిక ప్రజలు ఎంతగా మొత్తుకున్నా అధికారగణం ఎంతమాత్రం పట్టించుకోలేదు. డబ్బు సంపాదన గురించి తప్ప ప్రజల రక్షణ గురించి పట్టించుకోని ‘గెయిల్’ సంస్థ నిర్లక్ష్యం కారణంగా ఇప్పుడు 14 నిండు ప్రాణాలు మాడిపోయాయి. ఒకవైపు రిలయన్స్, మరోవైపు గెయిల్, ఇంకోవైపు ఓఎన్జీసీ.... సంస్థ ఏదైనా కావొచ్చు. ఏ సంస్థకి అయినా డబ్బు సంపాదన మీద వున్న ఆసక్తి కోనసీమ ప్రజల రక్షణ మీద లేకపోవడం దురదృష్టకరం.

 

 

కోనసీమలో బ్లో ఔట్లు, గ్యాస్ లీకేజీలు మామూలైపోయాయి. 1993లో వచ్చిన పాశర్లపూడి బ్లో  ఔట్ ప్రపంచంలోనే అతి పెద్ద బ్లో ఔట్‌లలో రెండో స్థానంలో నిలిచింది.  ఎప్పుడైతే కోనసీమలో గ్యాస్ పైపులైన్లు వేశారో అప్పటి నుంచి కోనసీమ ప్రజలు ప్రాణాలు అరచేతుల్లో పట్టుకుని బతుకుతున్నారు. ఎవరెవరో కోట్లకు కోట్లు సంపాదించుకుంటూ వుంటే, కోనసీమ ప్రజలు మాత్రం భయం పడగ నీడలో జీవిస్తున్నారు. కోనసీమ గ్యాస్ పైప్ లైన్ల విషయానికొస్తే, స్థానికుల భయాందోళనలు ఒక కోణమైతే, స్థానిక వనరులను స్థానికులకు ఎంతమాత్రం ఉపయోగపడనివ్వకుండా నిర్దాక్షిణ్యంగా దోచుకువడం మరో కోణం.

 

ఆంధ్రప్రదేశ్‌లో సహజ వనరులు పుష్కలంగా వున్నాయి. కానీ ఆ వనరులేవీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎంతమాత్రం అందుబాటులో లేవు. ఏ ప్రాంతంలో లభించే వనరులు ఆ ప్రాంతానికే దక్కాలని దేశంలోని అన్ని రాష్ట్రాలూ నినదిస్తున్నాయి, ఉద్యమిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలయితే మా రాష్ట్రంలోని వనరులు మాకేసొంతం అని నిర్మొహమాటంగా ప్రకటించాయి. అయితే ఆంధ్రప్రదేశ్‌ విషయంలో మాత్రం ఇప్పటి వరకు ఆ అవకాశం కనిపించడం లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ కొరతను తీర్చడానికి కోనసీమలోని గ్యాస్ ఎంతో ఉపయోగపడే అవకాశం వుంది. అయితే ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ సమస్య తీర్చడానికి ఇక్కడ ఉత్పత్తి అయ్యే సహజ వాయువును కేటాయించాలని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా అప్పటి కేంద్ర ప్రభుత్వాలు కనికరించిన పాపాన పోలేదు. ఇక్కడి సహజవాయువుని పైపులైన్ల ద్వారా ఎక్కడికెక్కడికో తరలించుకుని వెలుగులు నింపుకుంటూ, డబ్బు సంపాదించుకుంటూ దర్పం వెలగబెట్టారే తప్ప, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గ్యాసులో వాటా ఇచ్చిన దాఖలాలు లేవు. గత ప్రభుత్వ హయాంలో 2.5 మిలియన్‌ మెట్రిక్‌ స్టాండర్డ్‌ క్యూబిక్‌ మీటర్‌ పర్‌ డే (ఎంఎంఎస్‌సిఎండీ) రీగ్యాసిఫైడ్‌ లిక్విఫైడ్‌ నేచురల్‌ గ్యాస్‌ని సరఫరా చేయడానికి గ్యాస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా అంగీకరించింది అయితే ఇంతవరకు దానికి సంబంధించిన ఫైళ్ళు ముందుకు కదలలేదు. రాష్ట్రం విడిపోవడం,  అటు కేంద్రంలో, ఇటు ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వాలు మారడంతో పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చింది.

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థికంగా వెనుకబాటును ఎదుర్కొంటోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌లో వున్న సహజవనరులను రాష్ట్రం తన అభ్యున్నతి కోసం వినియోగించుకోవాల్సిన అవసరం వుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న గ్యాస్‌ను ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రధానంగా వినియోగించుకునే హక్కును సాధించుకోవాల్సిన అవసరం వుంది. అలాగే కోనసీమలో మరోసారి ‘నగరం’ తరహా దుర్ఘటనలు జరగకుండా ఆపాల్సిన అవసరం కూడా వుంది.

By
en-us Political News