అప్పుడే అసమ్మతి ‘గంట’ మ్రోగేసింది

 

మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మరియు మరో నలుగురు కాంగ్రెస్ యం.యల్యేలు తెలుగుదేశం పార్టీలో చేరి గట్టిగా 24గంటలు కూడా గడవక ముందే అప్పుడే గంటా బ్యాచ్ తెదేపాకి అసమ్మతి గంట కొట్టేసింది. వాళ్ళ రాకను మొదటి నుండి వ్యతిరేఖిస్తున్న సీనియర్ తెదేపా నేత అయ్యన్న పాత్రుడు నిన్న వారు పార్టీలో చేరిన తరువాత వారి పట్ల తన అయిష్టతను బహిరంగంగానే ప్రకటించేయడంతో గంటా బ్యాచ్ కంగు తింది.

 

చంద్రబాబు, గంటా బ్యాచ్ మరనేక మంది పార్టీ సీనియర్లు పాల్గొన్న సమావేశంలో అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ, “ఈ కొత్తగా వస్తున్న వాళ్ళు పార్టీలో ఎంత కాలం ఉంటారో ఎప్పుడు వెళ్లిపోతారో ఎవరికీ తెలియదు. కానీ, మేము మా కార్యకరతలం మాత్రం చనిపోయేవరకు పార్టీనే అంటిపెట్టుకొని ఉంటాము,” అని గంటా బ్యాచికి అందరి సమక్షంలో చురుకలు వేసారు. ఆయన అలా అనడానికి బలమయిన కారణం ఉంది.

 

గత ఎన్నికల సమయంలో గంటా శ్రీనివాసరావు తెదేపాకు హ్యాండిచ్చి ప్రజా రాజ్యం పార్టీలోకి దూకి, అక్కడి నుండి చిరంజీవితో కలిసి కాంగ్రెస్ పార్టీలోకి దూకేసి మంత్రి అయిపోయారు. పార్టీ కష్ట కాలంలో ఉన్నపుడు బయటకి దూకేసి పారిపోయిన గంటా, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అదే పరిస్థితిలో ఉండటం చూసి మళ్ళీ తెదేపాలోకి దూకేశారు. ఒకవేళ ఎన్నికల తరువాత అదృష్టం బాగుండి కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వస్తే గంటా తెదేపాలోనే కొనసాగుతారనే నమ్మకం ఏమీ లేదు. అప్పుడు మళ్ళీ 'జై చిరంజీవ!' అంటూ హనుమంతుడిలా చిరంజీవి చేయ్యందుకొని కాంగ్రెస్ లోకి దూకేయడం ఖాయం. అందుకే అయ్యన్న పాత్రుడు ఆ విధంగా అన్నారు.

 

ఆయనే కాదు స్వయంగా గంటా శ్రీనివాసరావే పార్టీలో చేరుతున్న సందర్భంగా ప్రసంగిస్తూ, “మా వంటి నేతలు తెదేపాలోకి వస్తుంటారు..వెళ్లిపోతుంటారు. కానీ పార్టీ కార్యకర్తలు మాత్రం పార్టీనే అంటిపెట్టుకొని ఉన్నారు. ఏమయినప్పటికీ తెదేపాలోకి రావడం స్వంత ఇంటికి చేరుకోన్నట్లే నాకు అనిపిస్తోంది,” అని అన్నారు.

 

మరి తనన్న మాటలనే అయ్యన్న నోట విన్నపుడు గంటా ఎందుకు అంత ఉలికి పడ్డారో తెలియదు కానీ తెదేపా నేతలతో ఏర్పాటు చేసిన తొలి సమావేశానికి తన బ్యాచ్ తో సహా డుమ్మా కొట్టేసి పార్టీలోకి వచ్చి 24గంటలు కూడా కాకముందే అసమ్మతి గంట కొట్టేసారు. అయ్యన్నపై క్రమ శిక్షణా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసినట్లు తాజా సమాచారం.