భీమిలిలో గంటా వర్గం ఖాళీ... వైసీపీలో కొత్త టెన్షన్!!

విశాఖ జిల్లా భీమిలి నియోజక వర్గం 2019 సార్వత్రిక ఎన్నికల్లో హాట్ టాపిక్ గా మారిన విషయం విదితమే. అక్కడ టిడిపి తరపున పోటీ చెయ్యడానికి అప్పుడు ఎంపిగా ఉన్న అవంతి శ్రీనివాస్ అదే సమయంలో మంత్రిగా ఉన్న గంటా శ్రీనివాసరావులు తీవ్రంగా పోటీ పడ్డారు. చివరకు అవంతి శ్రీనివాస్ వైసీపీ గూటికి చేరి భీమిలిలో విజయం సాధించారు. మరోవైపు గంటా శ్రీనివాసరావు ఎప్పట్లాగే నియోజకవర్గం మారారు. విశాఖ ఉత్తర నియోజక వర్గం నుంచి అని గెలుపొందారు.

భీమిలిలో విజయం సాధించిన అవంతి శ్రీనివాస్ కు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంత్రి వర్గంలో స్థానం దక్కింది. అప్పటి నుంచి ఆయన మాజీ మంత్రి గంటాపై విమర్శనాస్త్రాలు సంధించడం మొదలు పెట్టారు. కానీ ఆయన మాత్రం మంత్రి అవంతి మాటలకు ఎక్కడ ప్రతిస్పందించడం లేదు. నిజానికి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు భీమిలి నియోజకవర్గంలో ఉన్నపుడు ఆయన వెనక చాలా మంది నాయకులుండేవారు. అయితే భీమిలి నియోజక వర్గం నుంచి విశాఖ ఉత్తర నియోజకవర్గానికి గంట వెళ్లడంతో ఆయన వెనకున్న కొంతమంది అవంతి వైపు చేరారు. మరికొందరు మాత్రం ఎన్నికల సమయంలో సబ్బం హరి అక్కడి నుంచి పోటీ చేసినప్పటికీ గంట వర్గీయులుగానే కొనసాగుతున్నారు. ఈనేపధ్యంలో గంటాపై మంత్రి అవంతి వరుసగా విమర్శనాస్త్రాలు సంధిస్తుండడం వాటికైన స్పందించకపోవటం జరుగుతుంది. ఇక ఇలాగైతే లాభం లేదని మంత్రి అవంతి కొత్త పంథాను ఎంచుకున్నారు. ఇందులో భాగంగానే భీమిలి నియోజకవర్గంలో గంటా వర్గీయులుగా ఉన్న వారిని వైసీపీలో చేర్చుకున్నారు.

అవంతి పిలవగానే గంట వర్గీయులు వైసీపీలో చేరడానికి కారణమేంటని ఆరా తీస్తే అసలు సంగతి బయటపడిందని స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. భీమిలిలో గంటా వర్గం లోని ప్రతి నాయకుడికి మంత్రి అవంతినే స్వయంగా ఫోన్ చేశారు అధికారంలో ఉన్న పార్టీ అందులో మంత్రి తమకు అన్నిసార్లు ఫోన్ చేయడంతో భీమిలిలోని గంటా వర్గీయులు ఆగలేకపోయారు. ఇప్పటికే టిడిపి నేతలను వేధించడం ఇబ్బంది పెట్టడం వంటి ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. తమపై వేధింపులు మొదలయ్యే అవకాశం ఉందని భావించి వైసీపీలో చేరారు. కొందరేమో ఇప్పటికే చిన్న చిన్న నామినేటెడ్ పదవుల్లో ఉన్నారు. తాము ఆ పదవుల్లో అలాగే కొనసాగాలంటే అధికార పార్టీ అండదండలు తప్పనిసరని వారు కూడా పార్టీ మారారు. మరికొందరు భీమిలికి టిడిపి ఇంచార్జిగా ఉన్న సబ్బం హరి పార్టీని పూర్తి స్థాయిలో పట్టించుకోవడం లేదని ఈ క్రమంలో మంత్రే స్వయంగా పిలవడంతో వైసీపీలోకి వెళ్లామని అంటున్నట్లు సమాచారం. 

ఇదిలా వుంటే అవంతి శ్రీనివాస్ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గంట వర్గీయుల చేరిక పై మరోలా చెబుతున్నారు. ఎందుకండీ వాళ్ళని పార్టీలో చేర్చుకున్నారు అని అవంతిని ఎవరైనా అడిగితే ఆ ఒకప్పుడు నేను ఎమ్మెల్యేగా పని చేసినప్పుడు వాళ్ళంతా నా అనుచరులే నా వెనకు తిరిగే వారు నేను చెబితేనే వారంతా గంటా వెనుక నడిచారు నేను మళ్లీ ఈ నియోజకవర్గానికి రావడంతో వారంతా ఒక్కొక్కరుగా వచ్చేస్తున్నారని అంటున్నారు. తాను ఎవరిని పిలవలేదు అని ఆయన బయటకు చెబుతున్నారు. తన మాటలకు గంట నుంచి స్పందన లేకున్నా ఆయన వర్గీయులను తన వైపు తిప్పుకున్నాననే సంతృప్తిలో అవంతి ఉన్నారు. మరోవైపు భీమిలి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొత్త గుబులు మొదలైంది. ఇక్కడ ఇప్పటికే చాలా చోట్ల ఆ పార్టీ నాయకులు రెండు వర్గాలుగా ఉన్నారు. ఈ క్రమంలో టిడిపి నుంచి వలస వచ్చిన వారిని చూసి ఇప్పుడు మూడో వర్గం కూడా తయారవుతుందని అనుకుంటున్నారు. మొత్తం మీద గంట మీద పై చేయి సాధించేందుకు మంత్రి అవంతి శ్రీనివాస్ వేసిన ఎత్తులు మున్ముందు భీమిలి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి సెగలు రేపుతాయో చూడాలి.