సూరి హత్యకేసులో భానుకిరణ్‌కు యావజ్జీవ శిక్ష


ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన గంగుల సూర్యనారాయణరెడ్డి అలియాస్‌ మద్దెలచెరువు సూరి హత్య కేసులో నాంపల్లి సీఐడీ కోర్టు ఇవాళ తీర్పు వెలువరించింది. మాజీ మంత్రి పరిటాల రవి హత్య కేసులో ప్రధాన నిందితుడైన సూరి 2011 జనవరిలో హత్యకు గురయ్యారు. సూరి, అతడి ప్రధాన అనుచరుడు భానుకిరణ్, డ్రైవర్‌ మధు జూబ్లీహిల్స్‌ నుంచి సనత్‌నగర్‌ వెళ్తుండగా యూసఫ్‌గూడ సమీపంలో సూరిపై పాయింట్‌ బ్లాంక్‌లో కాల్పులు జరపడంతో ప్రాణాలు కోల్పోయారు. సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న భానును కోర్టుగా దోషిగా తేల్చనుందా లేదా నిర్దోషిగా విడుదల చేయనుందా అనేదానిపై  రెండు తెలుగు రాష్టాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ ఉత్కంఠకు ముగింపుపలుకుతూ... నాంపల్లి కోర్టు తుది తీర్పు వెలువరించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు భానుకిరణ‌్‌ను న్యాయస్థానం దోషిగా తేల్చింది. అతడికి యావజ్జీవ శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. శిక్షతో పాటు రూ. 20 వేల జరిమానా విధించింది. ఇదే కేసులో మరో నిందితుడు మన్మోహన్‌సింగ్‌కు ఐదేళ్లు జైలుశిక్ష, రూ. 5 వేలు జరిమానా విధించింది. కోర్టు తీర్పు సూరి సతీమణి గంగుల భానుమతి హర్షం వ్యక్తం చేశారు.