అసమ్మతి నేతలపై వేటుకి కాంగ్రెస్ పిర్యాదు

 

ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ దైర్యం చేసి 9 మంది అసమ్మతి శాసన సభ్యులకు వ్యతిరేఖంగా ఈ రోజు స్పీకర్ నాదెండ్ల మనోహర్ కి పిర్యాదు చేసింది. పార్టీకి వ్యతిరేఖంగా పనిచేస్తున్న ఆ 9 మందిపై వెంటనే తగిన చర్యలు తీసుకోవలసిందిగా ప్రభుత్వ చీఫ్ విప్ గండ్రవెంకటరమణారెడ్డి స్పీకర్ ను కోరారు. కాంగ్రెస్ అధిష్టానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినందునే పార్టీ ఈ నిర్ణయం తీసుకొన్నట్లు తెలుస్తోంది.

 

అయితే స్పీకర్ వారిపై వేటువేసినట్లయితే, రాష్ట్రంలో మళ్ళీ ఉపఎన్నికలు వచ్చే అవకాశం ఉంది గనుక, ఆయన నిర్ణయం తీసుకోవడానికి కొంచెం తాత్సారం చేయవచ్చును. ప్రస్తుత అనిశ్చిత రాజకీయ పరిస్థితుల్లో ఉపఎన్నికలు రావడం కాంగ్రెస్ పార్టీకి లాభం కలిగించకపోగా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకే లాభం కలిగించే అవకాశం ఉంది. గనుకనే, తెదేపా కూడా తన విప్పును దిక్కరించి అవిశ్వాసానికి అనుకూలంగా ఓటేసిన తన 6మంది శాసన సభ్యులపై ఇంతవరకు స్పీకర్ కు పిర్యాదు చేయలేదు.

 

ఒకవేళ కాంగ్రెస్ పార్టీ తన 9 మంది శాసన సభ్యులపై వేటు వేసేందుకు సిద్ధం అయితే, అప్పుడు తెదేపా కూడా స్పీకర్ కు పిర్యాదు చేసి మొత్తం 15 స్థానాలకు ఒకేసారి ఉపఎన్నికలు వచ్చేలా చేసే అవకాశం ఉంది. అదే గనుక జరిగితే, అన్ని పార్టీలు కూడా ఉపఎన్నికలను రాబోయే సాధారణ ఎన్నికలకి సెమీ ఫైనల్స్ గా భావించి విజయం సాదించేందుకు తీవ్ర పోరాటం చేయవచ్చును.

 

అయితే, సాధారణ ఎన్నికలకి కేవలం ఏడాది మాత్రమే సమయం మిగిలిఉన్న ఈ తరుణంలో రాష్ట్రంలో రెండు ప్రధాన పార్టీలయిన కాంగ్రెస్, తెదేపాలు ఉపఎన్నికలు తెచ్చి చేజేతులా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మేలు చేయకపోవచ్చును. ఒకవేళ ఉపఎన్నికలే జరిగి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో రెండు మూడు సీట్లు పెరిగినా అది ఆపార్టీ ఆత్మవిశ్వాసాన్ని పెంచడమే కాకుండా, ప్రజలలో తనకు రాన్రాను సానుభూతి, మద్దతు తగ్గిపోతోందని కాంగ్రెస్ చేస్తున్న ప్రచారానికి సరయిన జవాబు చెప్పినట్లు అవుతుంది. ఇది కాంగ్రెస్ పార్టీకి ఎంత మాత్రం మంచి పరిణామం కాదు గనుక స్పీకర్ తన నిర్ణయాన్ని ప్రకకటించేందుకు మరికొంత సమయం తీసుకోవచ్చును.