విజయవాడ తెదేపా తమ్ముళ్ళ లుకలుకలు

 

రాబోయే ఎన్నికలలో విజయవాడ తూర్పు నియోజక వర్గం నుండి లోక్ సభకు పోటీ చేయాలనీ ఆశలు పెట్టుకొన్న గద్దె రామ్మోహన్ రావు, ఇటీవల చంద్రబాబు పాదయాత్రలో తన స్థానాన్ని కేశినేని నానికి కేటాయించడంతో పార్టీపై అలిగారు. అప్పుడు చంద్రబాబు ఆయనను తన వద్దకే రప్పించుకొని తానూ పాదయత్ర ముగించుకొని పార్టీ కార్యాలయానికి తిరిగి వచ్చిన తరువాత అన్నీ మాట్లాడుకొందామని సర్దిచెప్పి పంపించేసారు. కానీ, చంద్రబాబు తిరిగి వచ్చి అప్పుడే మూడు వారాలు అవుతున్నపటికీ, తనను ఇంతవరకు పిలిచి మాట్లాడకపోవడంతో తీవ్ర అసంతృప్తి చెందిన ఆయన, తానూ పార్టీకి చేసిన సేవలు, తన రాజకీయ అనుభవం అన్నీ వివరిస్తూ గత రెండు ఎన్నికల సందర్భంలో ఇతరులకోసం తనను పార్టీ ఏవిధంగా పక్కన బెట్టినదీ, అయినా తానూ ఏవిధంగా పార్టీకి సహకరించారో తెలియజేస్తూ కరపత్రాలు ముద్రించారు. వాటిలో పార్టీకి సేవలు చేసిన వారిని కాదని పెట్టుబడి దారులకు మాత్రమే పార్టీ టికెట్స్ కేటాయించే సంస్కృతి పెరిగిపోయిందని, ఇది పార్టీ భవిష్యత్తుకు ఎంతమాత్రం మంచిది కాదని పేర్కొన్నారు. అంతేకాక, పార్టీ అధిష్టానంపై కూడా తీవ్ర విమర్శలు చేసినట్లు సమాచారం. దాదాపు లక్ష కరపత్రాలను ఆయన తన పేరిటే ముద్రించి ప్రజలకి, పార్టీ కార్యకర్తలకి పంచేందుకు సర్వం సిద్ధం చేసుకొన్నట్లు తెలియడంతో తెదేపా అధిష్టానం తన దూతలను హుటా హుటిన గద్దె రామ్మోహన్ రావు వద్దకు పంపినట్లు తెలుస్తోంది. ఎన్నికలకి ఇంకా 10 నెలల సమయం మిగిలి ఉండగానే పార్టీలో అసంతృప్తి నేతలు ధిక్కార స్వరాలూ వినిపించడం, పార్టీ వారిని బుజ్జగించడం కూడా అప్పుడే మొదలయిపోయాయి.