శ్రీ యేసయ్య నమః.. అన్యమత ప్రచారాలతో హోరెత్తుతున్న టీటీడీ

 

ప్రతి ఏటా తిరుమలలో జరిగే కార్యక్రమాలను తెలుసుకునేందుకు టీటీడీ క్యాలెండర్ ను కొనుగోలు చేస్తారు శ్రీ వారి భక్తులు. తిరుమల పంచాంగం తెలుగుతో పాటు ఇంగ్లీష్ క్యాలెండర్ అందించేవారు కూడా ఉంటారు. ఆంగ్ల సంవత్సరం 2020  దగ్గర పడుతున్నందున ఎప్పటిలాగే తిరుమల కొత్త క్యాలెండర్ కోసం ఎదురు చూస్తున్న వారు చాలా మందే ఉన్నారు. వారంతా ఆన్ లైన్ లో క్యాలెండర్ బుక్ చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అలా క్యాలెండర్ కోసం సెర్చ్ చేస్తున్న వారు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. టీటీడీ కొత్త క్యాలెండర్ డౌన్ లోడ్ కోసం చూస్తున్న వారికి ఇలా డిస్క్రిప్షన్ లో అన్యమత నినాదం శ్రీ యేసయ్యా అని దర్శనమిచ్చింది.

ఇంకా కొత్త క్యాలెండర్ ను టీటీడీ అప్ లోడ్ చేయలేదు. కానీ పాత క్యాలెండర్ లో ఇపుడు అన్యమత నినాదం కనిపించటం విమర్శలకు తావిస్తోంది. పాత క్యాలెండర్ పీడీఎఫ్ డౌన్ లోడ్ డిస్క్రిప్షన్ లో ఈ నినాదం కనిపించడంతో యేసయ్య పేరు తిరుమల సైటులో ఎందుకొచ్చింది అన్న ప్రశ్న ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. టీటీడీ అధికారుల తీరుపై హిందూ సంఘాల నేతలు.. శ్రీ వారి భక్తులు మండిపడుతున్నారు. టీటీడీలో అసలు ఏం జరుగుతోందంటూ ప్రశ్నిస్తున్నారు బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి. టీటీడీలో అన్యమతస్తులను వెంటనే తొలగించాలని ఈ వ్యవహారంలో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

వెబ్ సైట్ లో అన్యమత ప్రచారంపై టీటీడీ టెక్నికల్ విభాగం పొంతన లేని సమాధానం చెబుతుంది. వివాదం పై స్పందించిన టీటీడీ ఈవో సింఘాల్ విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. ఇది ఇంటి దొంగల పనే కావచ్చని అనుమానిస్తున్న విజిలెన్స్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. తిరుమలలో అన్యమత ప్రచారం సాగుతోందని కొంత కాలంగా ఆరోపణలొస్తున్నాయి. ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వంలోకి వచ్చాక ఏపిలో మతాల లొల్లి ఎక్కువైందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇలాంటి సందర్భాల్లో ఏకంగా తిరుమల సైటులోనే అన్యమత ప్రచారంపై హిందూ మత సంఘాలు శ్రీ వారి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అగస్టులో బస్సు టికెట్ లతో అన్యమత ప్రచారం చేశారు. తిరుమల వెళ్లే బస్ టిక్కెట్ల వెనుక హాస్ జెరూసలేం యాత్ర ప్రకటనలు ముద్రించి ఉండడంపై వివాదం రేగింది. ఆ టిక్కెట్లు గత ప్రభుత్వ హయాంలో ముద్రించినవి అని చెప్పి ప్రభుత్వం చేతులు దులుపుకుంది. ఇప్పుడు ఏకంగా తిరుమల వెబ్ సైట్ లోనే ప్రచారం నిర్వహించడం పై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.