మూడు రోజుల్లో 4 మరణాలు! సచివాలయంలో కరోనా పంజా 

తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసులు, మరణాలు భయంకరంగా పెరిగిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్  సచివాలయం కరోనా హాట్ స్పాట్ గా మారిపోయింది. మూడు రోజుల్లో నలుగురు సచివాలయ ఉద్యోగులు కరోనాతో మృతి చెందారు. మరికొందరు ఉద్యోగులు, కుటుంబ సభ్యులు వైరస్ భారీన పడ్డారు. 

పంచాయతీరాజ్ శాఖ సెక్షన్ ఆఫీసర్ శాంతకుమారి కరోనాతో మరణించారు. రెండు రోజుల క్రితం శాంతకుమారి భర్త కరోనాతో మృతి చెందారు. హోంశాఖలో రికార్డ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న వ్యక్తి కరోనాతో మరణించారు. కరోనా పంజాతో ఏపీ సచివాలయ ఉద్యోగుల్లో కలకలం సృష్టిస్తోంది. భయంతో విధులకు రావడానికి ఉద్యోగులు జంకుతున్నారు. తమకు వర్క్ ఫ్రం హోం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. 

సచివాలయం ఉద్యోగులు కరోనాతో మృతిచెందటం పట్ల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. తన చాంబర్‌లో రెండు నిమిషాల పాటు ఆయన మౌనం పాటించారు. ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని, వీలైనంత వరకు వ్యాక్సినేషన్‌ తీసుకోవాలని మంత్రి పెద్దిరెడ్డి సూచించారు.

ఏపీ సచివాలయ ఉద్యోగుల మృతికి టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి  చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు.ప్రభుత్వ నిర్లక్ష్యం, ప్రణాళికాలోపమే ఉద్యోగుల మృతికి కారణమని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ దాటడం లేదన్నారు.  జగన్ అలసత్వం వల్లే రాష్ట్రంలో కరోనా విలయతాండవం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగులందరికీ తక్షణమే టీకా అందించాలని కోరారు. కరోనా బారిన పడిన ఉద్యోగులకు మెరుగైన వైద్యం అందించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఉద్యోగులకు ఇంటి నుంచే విధులు నిర్వర్తించే అవకాశం కల్పించాలని చంద్రబాబు తెలిపారు.