మంత్రి బొజ్జల తండ్రి కన్నుమూత

Publish Date:Jan 7, 2015

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అటవీశాఖమంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తండ్రి, మాజీ ఎమ్మెల్యే బొజ్జల గంగ సుబ్బరామిరెడ్డి (95) బుధవారం నాడు తన స్వగ్రామం ఊరందూరులోని స్వగృహంలో కన్నుమూశారు. 95 ఏళ్ళ వయసులో కూడా ఆరోగ్యంగా వుండే ఆయన బుధవారం ఉదయం గ్రామంలోని పొలాల దగ్గరకి వెళ్ళి వాటిని పరిశీలించారు. అనంతరం బంధువుల ఇళ్ళకు కూడా వెళ్ళి వచ్చారు. సాయంత్రం ఆరు గంటల సమయంలో ఆయన శ్వాస అందక మరణించారు. గంగ సుబ్బరామిరెడ్డి భార్య విశాలాక్షి 1995లో మరణించారు. శ్రీకాళహస్తి మండలం ఊరందూరు గ్రామంలో 1920 మే 14 వ తేదీన బొజ్జల గంగసుబ్బరామిరెడ్డి జన్మించారు. వ్యవసాయ కుటుంబానికి చెందిన ఆయన తొమ్మిదో తరగతి వరకు మాత్రమే విద్యాభ్యాసం చేశారు.ఆయనకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. రాష్ట్ర అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి రెండో సంతానం. బొజ్జల గంగ సుబ్బరామిరెడ్డి గ్రామ కమిటీ ఛైర్మన్‌గా రాజకీయ ప్రస్థానం ప్రారంభించి ఎమ్మెల్యే పదవి వరకూ ఎదిగారు.

By
en-us Political News