'గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్' తో  కొత్త అధ్యాయానికి తెర లేపబోతున్న తెలంగాణ ప్రభుత్వం

 

మరి కొన్ని గంటల్లో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. పారిశ్రామిక రంగంలో కొత్త ఒరవడి సృష్టించటానికి అంతా సిద్ధం చేసుకుంది తెలంగాణ ప్రభుత్వం. యాదాద్రి జిల్లాలో గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ ను ప్రారంభించనుంది. దీని ద్వారా రెండు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తోంది. అంతేకాదు ప్రత్యక్షంగా పరోక్షంగా యాభై వేల మందికి ఉపాధి లభిస్తుందని భావిస్తోంది. 

దేశంలో ఎక్కడా చిన్న పరిశ్రమలకు ప్రత్యేక పార్క్ లేదు. దీంతో తెలంగాణ ప్రభుత్వం వినూత్న పంథాలో ఓ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేస్తోంది. దీనికోసం హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారి పక్కన దండు మల్కాపురంలో కొండలను తొలిచి వందడుగుల అప్రోచ్ రోడ్డును నిర్మించారు. టీఫ్ ఆధ్వర్యంలో నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి. పార్కుల అంతర్గత రోడ్లు, ఫుట్ పాత్లు ,డ్రైనేజీ వంటి సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ గ్రీన్ పార్క్ లో నాలుగు వందల కాలుష్యరహితమైన పరిశ్రమలు ఏర్పాటు కాబోతున్నాయి. ఎలక్ట్రోనిక్స్, వైమానిక, ఆహార శుద్ధి, డ్రిల్లింగ్ రక్షణ తదితర రంగాలకు చెందిన ఉత్పత్తులు తయారు కానున్నాయి. పార్క్ లో ఇరవై శాతం భూముల్లో హరితహారానికి కేటాయించారు. అలాగే పది వేల మంది కార్మికుల కోసం నూట ఇరవై ఎకరాల్లో అతిపెద్ద టౌన్ షిప్ ను నిర్మిస్తున్నారు. టీఎస్ఐఐసీ టిఫ్ సమన్వయంతో సిఎం కెసిఆర్, మంత్రి కెటిఆర్ ఈ గ్రీన్ పార్కు పనులను అధికారులతో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. 

యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం దండు మల్కాపురంలో ఏర్పాటవుతున్న ఈ గ్రీన్ పార్క్ శుక్రవారం ప్రారంభం కానుంది. తొలి విడతగా పన్నెండు వందలు యాభై ఎకరాల్లో పనులు ప్రారంభించారు. మరో ఏడు వందల యాభై ఎకరాలు ప్రభుత్వం సేకరించనుంది. రెండు వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో పరిశ్రమలు ఏర్పాటవుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. గ్రీన్ పార్కు పనులను టిఎస్ఐఐసి చైర్మన్ బాలమల్లు ఎమ్మెల్సీ లు ఇంజనీర్ లు పరిశీలించారు. హైదరాబాద్ విజయవాడ హైవే పక్కనే పార్కు పైలాన్ ను ఏర్పాటు చేస్తున్నారు. 

చిన్న పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఈ గ్రీన్ పార్కును ఏర్పాటు చేస్తోందన్నారు బాలమల్లు.దండు మల్కాపురంలో ఏర్పాటు చేస్తున్న గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ తెలంగాణకే తలమానికంగా ఉంటుంది అన్నారు ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్. సిఎం కెసిఆర్ ఆర్థిక పారిశ్రామిక ప్రగతికి ఈ పార్క్ ముందుచూపు లాంటిది అని చెప్పారు. ఈ గ్రీన్ పార్కుతో ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు చౌకగా స్థలం దొరుకుతుందన్నారు మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి. ఈ ప్రాంతంలో యువతకు ఉపాధి లభిస్తుందని చెప్పుకొచ్చారు. గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుతో తమ కష్టాలు తొలగిపోతాయని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చిన్న పరిశ్రమల్లో స్థానికులకే అవకాశం కల్పించాలని కోరుతున్నారు.పారిశ్రామిక రంగాల్లో ఎదగాలనుకునే ఔత్సాహికులకు ఈ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే రాష్ట్రంలో పెట్టుబడులు కూడా ఈ పార్క్ దోహద పడుతుందనేది స్థానికుల వారి భావాలను వ్యక్తం చేశారు. మరి ఈ పార్క్ నిజంగానే వారి జీవితాల్లో కొత్త వెలుగులను నింపబోతోందో లేదో వేచి చూడాలి.