కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చడానికి 2000 కోట్లతో ప్లాన్.. ఎఫ్ఐఆర్ నమోదు

రాజస్థాన్ లోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందంటూ ఆ రాష్ట్ర సీఎం అశోక్ గెహ్లాట్ ఆరోపించారు. దీని కోసం ఆ పార్టీ సిగ్గు కూడా వదిలేసి ప్రయత్నాలు చేస్తోందని అయన బీజేపీ మీద మండి పడ్డారు. ఈరోజు మీడియాతో మాట్లాడిన అయన "నేను ప్రస్తుతం దేశంలో జరుగుతున్న పరిస్థితుల మీద చర్చించేందుకు ఈ రోజు మీ ముందుకు వచ్చా. కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు నేను అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తున్నా. కానీ, బీజేపీ మాత్రం మానవత్వం మరిచిపోయి. కరోనా విజృంభిస్తున్న సమయంలో ప్రజలు ఎన్నుకొన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్ర పన్నుతోంది." అని ఆరోపించారు. అంతే కాకుండా "కొంతమంది సిగ్గులేని నాయకులూ కూడా ఉంటారు. అటువంటి వారే గుజరాత్‌లో ఏడుగురు ఎమ్మెల్యేలను ఎత్తుకెళ్లి రెండు సీట్లు సాధించారు. రాజస్థాన్ లో కూడా అలాగే చేయడానికి వారు ప్రయత్నించారు. ఇక్కడ మాత్రం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఇతర ఎమ్మెల్యేలు సహకారంతో మేం రెండు సీట్లు సాధించాం. ఐతే ఆ సిగ్గులేని నాయకులూ మాత్రం ఇంకా పాత టెక్నిక్‌లు వాడుతూనే ఉన్నారు." అని గెహ్లాట్ బీజేపీ నేతలను విమర్శించారు.

రాజస్థాన్ లో ఒక ఆయుధ స్మగ్లింగ్ ముఠాకు సంబంధించి కొంత మంది ఫోన్ల పై నిఘా పెట్టగా వారి సంభాషణలలో గెహ్లాట్ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం జరుగుతున్నటుగా ఎస్ ఓ జి పోలీసులు గుర్తించి ఇద్దరిని అరెస్ట్ చేసారు. అంతే కాకుండా ప్రభుత్వాన్ని కూల్చడానికి రూ.1000 కోట్ల నుంచి రూ.2000 కోట్లు ఖర్చు చేయనున్నట్టు వారి సంభాషణల్లో వెల్లడైనట్లు సమాచారం. మొన్న జరిగిన రాజ్యసభ ఎన్నికల కు ముందే ప్రస్తుత ప్రభుత్వాన్ని కూలదోయడానికి కుట్ర చేశారంటూ పోలీసులు తాజాగా ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. ఐతే రాష్ట్ర బీజేపీ నేతలు మాత్రం ఇవి నిరాధారమైన ఆరోపణలుగా కొట్టి పారేశారు.