ఎంత సుఖమో.. వారానికి నాలుగు రోజులే పని.. మూడు రోజులు సెలవులు

హెక్టిక్ షెడ్యూల్ స్ట్రెస్ ఫుల్ లైఫ్ తో వారం రోజులు గట్టిగా పని చేయగానే శరీరం మనసు డీలాపడిపోతుంది. వీక్లీ ఆఫ్ కోసం మనసు ఆశగా ఎదురు చూస్తోంది. సెలువు రోజు ఫుల్ గా తినేసి హాయిగా నిద్రపోతే తప్ప మళ్లీ వారానికి సరిపడే పని చేసేంత శక్తి రావటం లేదు. దీంతో ఫ్యామిలీ, ఫ్రెండ్స్, హాబీలు ఇష్టాయిష్టాలు లాంటివి ఏనాడో అటకెక్కేశాయి. మనమంతా మరమనిషిలా మారిపోతున్నాము. అయితే మల్టీనేషనల్ కంపెనీల్లో పని చేసే వాళ్లకు మాత్రం వారానికి రెండు రోజులు సెలవులు దొరుకుతున్నాయి. ఒకరోజు రెస్టు తీసుకున్న ఇంకో రోజు ఫ్యామిలీతో గడుపుతున్నారు. కానీ ఆ రెండు రోజులు కూడా అప్పుడప్పుడు సరిపోవటం లేదు. పెండింగ్ పనులు ఉంటే అవి చక్కబెట్టుకోవడానికే ఆ వీకెండ్స్ కూడా సరిపోతుంది. దీంతో వారానికి నాలుగు రోజులే వర్కింగ్ డేస్ ఉంటే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్ తెరపైకి వచ్చింది. వారంలో నాలుగు రోజులు పనికి మూడు రోజులు పర్సనల్ లైఫ్ కి కేటాయించేలా చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలు సీరియస్ గా సాగుతున్నాయి. ఉద్యోగులు, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో గడిపే వాళ్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడి క్వాలిటీ ఔట్ పుట్ వస్తుందని శాస్త్రీయంగా నిర్ధారణ కావటంతో ఈ విషయం పై ఇప్పుడు సీరియస్ గా ఆలోచిస్తున్నారు. పనిదినాలు తగ్గే కొద్దీ ప్రొఫెషనల్ లైఫ్ కి పర్సనల్ లైఫ్ కి సమన్యాయం ఏర్పడి 20 శాతం మెరుగైన ఉత్పత్తి వస్తుందని సర్వేలో తేలింది. అందుకే ఆలీబాబా కంపెనీ వ్యవస్థాపకుడు జాక్ మా కూడా వారానికి నాలుగు పనిదినాలపై సీరియస్ గా ఆలోచిస్తున్నారు. గేట్ వే కాన్ఫరెన్స్ లో ఆయన ఓసారి మాట్లాడుతూ మా తాతయ్య పొలంలో రోజుకు 16 గంటలు పనిచేసేవారు, మనం ఇప్పుడు రోజుకు ఎనిమిది గంటలు పనిచేస్తున్నాము. వచ్చే 30 ఏళ్లల్లో ప్రజలు రోజుకు కేవలం నాలుగు గంటలు మాత్రమే పని చేస్తారు. అది కూడా వారానికి నాలుగు రోజులు మాత్రమే అని ఆయన జోస్యం చెప్పారు. 

సరే ఒక కంపెనీ యజమాని ఈ నియమాన్ని అమలు చేస్తే అది ఆ సంస్థలో పనిచేసే వాళ్లకే వర్తిస్తుంది. మరి ఇదే ఆలోచన ఓ దేశ ప్రధాని చేసి ఆచరణలోకి తీసుకు వస్తే ఎలా ఉంటుంది, ఫిన్ లాండ్ ప్రధాని సరిగ్గా ఇప్పుడు అదే చేస్తున్నారు. 34 ఏళ్లకే ఫిన్లాండ్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన సనా మ్యారిన్ రోజుకు ఆరు గంటల చొప్పున వారానికి నాలుగు రోజుల పనిదినాల పై సీరియస్ గా ఆలోచిస్తున్నారు. వారానికి 24 గంటలు పని చేస్తే సరిపోతుందా, తద్వారా వచ్చే లాభ నష్టాలు ఏంటనే దానిపై మేధో మథనం చేస్తున్నారు. సమాజం లోని అన్ని వర్గాల నుంచి అభిప్రాయాలు స్వీకరిస్తున్నారు. అంతా సవ్యంగా సాగితే ఈ విధానం అమలు లోకి వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఇక మన దగ్గిర అంటారా అంత సీన్ లేదు అండి మన దగ్గర అనార్గనైజ్డ్ సెక్టార్ లో పనిచేసే వాళ్లే రూ.50 కోట్ల మందికి పైగా ఉన్నారు. వీళ్లంతా రోజుకు 12 గంటలకు పైగా మండేటి ఎండలో దుమ్మూదూళి మధ్య పనిచేస్తున్నారు. ప్రతి ఆదివారం సెలవు కాదు కదా కనీసం నెలకు ఓ రెండ్రోజులు సెలవులు దొరికితే అదే మహాభాగ్యం, కనీస వేతనం కింద నెలకు రూ.15000 చెల్లించాల్సిందే అని చట్టం చేసినా ఎక్కడ అమలవుతుంది. ఐదారు వేల జీతానికి కోట్ల మంది పనిచేస్తున్నారు. ఇక మన దేశానికి వస్తే నిన్న ప్రధాని మోదీ కూడా దేశ ఆర్థిక ప్రగతి రథచక్రాలను నడిపిస్తున్న పారిశ్రామిక వేత్తలతో సమావేశమయ్యారు. భారత ఎకనామీ ఐదు ట్రిలియన్ డాలర్ లకు చేర్చడంపై కసరత్తు చేశారు. మనము ఏదో ఒక రోజు పాశ్చాత్య దేశాల స్థాయికి చేరుకుంటాం అయితే అది ఎప్పుడు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న, ఇప్పటికీ ఇప్పుడు మన ముందున్న టాస్క్ అల్లా జిడిపితో పాటు తలసరి ఆదాయం పెంచడం, సమాజం ఆర్థికంగా పరిపుష్టిగా ఉండటంతో పాటు పేద ధనిక మధ్య అంతరాలు ఎంత తక్కువగా ఉంటే ఆ సొసైటీ అంత హెల్దీగా ఉంటుంది.