కుటుంబ కష్టాల్లో కూరుకుపోయిన నటి సరిత

 

‘కోకిలమ్మ’ సరిత కుటుంబ కష్టాల్లో కూరుకుపోయింది. శ్రావ్యమైన గొంతుతో డబ్బింగ్ చెప్పే ఆమె సంసార జీవనరాగం శ్రుతితప్పింది. ఆమె భర్త, మలయాళ నటుడు ముఖేష్ సరిత నుంచి విడాకులు కోరుతూ కోర్టుకు ఎక్కాడు. అది కూడా 2009లో. రెండేళ్ళ క్రితం కోర్టు వీరిద్దరికీ విడాకులు మంజూరు చేసింది. ముఖేష్ మిధుల అనే మరో అమ్మాయిని కూడా పెళ్ళి చేసుకున్నాడు. అయితే సరిత ఈ విడాకులు చెల్లవంటూ కోర్టుకు ఎక్కింది. ఈ కేసువిచారణ జరుగుతోంది. గురువారం నాడు చెన్నై కుటుంబ సంక్షేమ కోర్టులో ఈ కేసు విచారణకు వచ్చిన సందర్భంగా సరిత ఆవేశంగా మాట్లాడుతూ స్పృహ తప్పి పడిపోయింది. ఉపచారాలు చేసిన మీదట కోలుకుంది. పెళ్ళి చేసుకుని 20 ఏళ్ళకు పైగా సంసారం చేయడంతోపాటు ఇద్దరు కొడుకులు పెద్దవాళ్ళయిన తర్వాత ఈ జంట విడిపోవాల్సి వచ్చింది. తన భర్తకు - తనకు మంజూరైన విడాకులు ఏకపక్షంగా వచ్చినవని సరిత వాదిస్తోంది. తనకు కోర్టు విడాకుల నోటీసులు పంపించిన సమయంలో తాను విదేశాలలో వున్నానని, ఆ నోటీసులు తాను అందుకోకపోవడం  కోర్టుకు హాజరు కాలేకపోయానని, కానీ ఈలోపే కోర్టు తనకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చేసిందని సరిత వాపోతోంది.