క‌రోనా వైరస్ మీద యుద్ధం చేద్దాం...

ఊరంతా నిశ్శబ్దం, రోడ్లన్నీ నిర్మానుష్యం. ఇళ్లల్లో తలుపులు బిగించి ఊసుపోక, ఊరికే ఉండలేక అసహనం తో అల్లాడుతుంటే.....ఉన్నపళంగా ఉప్పెనలా ఒక అలజడి. ఢిల్లీ త‌బ్లీగ్ జ‌మాత్ స‌మావేశాలు. అక్క‌డి నుంచి వ‌చ్చిన వారికి పాజిటివ్‌. చ‌నిపోతున్న వారు కూడా స‌మావేశాల‌కు వెళ్లి వ‌చ్చిన‌వారే. అంతే.... ఈ వార్త విన్న త‌రువాత‌...

మన జీవితంతో పెనవేసుకున్న కొన్ని పేర్లు చేదుగా వినిపిస్తున్నాయి.  క‌ళ్ళ ముందు పెరిగిన కరీమా కసాయి లా అనిపిస్తుంది. చిన్నప్పటి నుండి ఎత్తుకు ఆడించిన బషీర్ తాత బూచోడు అయ్యాడు. 10ఏళ్ళు కలిసి పనిచేసిన బేగం భయపెట్టే వ్యక్తి అయింది.  పసి వాడుగా ఉన్నప్పుడు నుండి మన పాలేరుగా పనిచేసిన ఇర్ఫాన్ ఇప్పుడు ఇబ్బంది పెట్టే వాడు అయ్యాడు.  ఉన్నపళంగా అన్ని మారిపోయాయి.

ఏదో జరిగింది.  అది తెలుసుకునే లోగా పాత వీడియోలు కొత్త పేర్లతో ఫోన్ లోకి వచ్చేసాయి.

ఇపుడు టోపి ఉన్నవాడు గడ్డం ఉన్నవాడు తుమ్మితే! కావాలనే తుమ్మాడు. తాకితే! అంటించాలనే తాకాడు. చూస్తే! చంపెయ్యాలనే చూస్తున్నాడు అంటున్నారు.  

ఎవరో ఏదో చెప్తే మన విచక్షణ ఏమైంది. ఇన్నాళ్లు కలిసి మెలసి ఉన్న మన వాళ్ళమీద నిందలు వేస్తూ 4 వీడియోలు రాగానే వాళ్ళని శత్రువులుగా చూడటం సరైనదేనా?  నిజాలు ప్రభుత్వము తేలుస్తుంది. ఈలోగానే మన పక్క వాడిని పగ వాడిలాగా చూస్తున్నాము. 

దేశంలో రోగం వచ్చింది అంటే ఒక వర్గం వారివల్ల వచ్చింది అనటం ఎంత హాస్యాస్పదంగా ఉంది.  విదేశాలనుండి విమానాల్లో తోలుకొచ్చిన వారి వల్ల కూడా వచ్చి ఉండవచ్చుగా. అక్రమ చొరబాటు దారులవల్ల కూడా రావచ్చుగదా.  చదువుకున్న వారు కూడా అసత్య ప్రచారాలు నమ్ముతూ వాటిని అందరికి పంచుతున్నారు. 

వారి ప్రమేయం లేకుండా ముద్దాయిలుగా నిలబడిన మన సోదరులపట్ల ఇంత నిర్దయగా ప్రవర్తించకూడదు.  ఒక వర్గం మొత్తాన్ని  దేశద్రోహులు గా మాట్లాడటం వారి కుటుంబాలని తూలనాడటం సరికాదు.  ఇప్పుడు మనం చేయాల్సింది
వారు కోలుకోవాలని ప్రార్ధిస్తూ, భౌతికదూరం పాటిస్తూ ,
సాటి మనిషికి సాయం చేయటం.  ఎందుకంటే..... 
మనం సమస్త మానవాళిని సోదరులు గా భావించే భారతీయులం కాబట్టి.