అన్నా...అన్నా...అంటుంటే సంబరపడ్డారు... ఇప్పుడు చుక్కలు కనబడుతున్నాయట...!

 

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి... అన్నా... అన్నా.... అంటూ పిలుస్తుంటే మొదట్లో మురిసిపోయిన ఐఏఎస్ లు, ఐపీఎస్ లు ఇప్పుడు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారట. సీఎం జగన్ యువకుడు కావడంతో తమ సూచనలు సలహాలు వింటాడని, తమ మాటను గౌరవిస్తాడని భావించిన ఐఏఎస్ లు, ఐపీఎస్ లకు ఇఫ్పుడు చుక్కలు కనిపిస్తున్నాయట. ఎల్వీ సుబ్రమణ్యం ఎపిసోడ్ తో బ్యూరోక్రాట్లంతా నోటిని జాగ్రత్తగా పెట్టుకుంటున్నారట. ప్రభుత్వ యంత్రాంగంలో అత్యున్నత స్థానంలో ఉన్న సీఎస్ నే ఆకస్మికంగా పీకిపడేసి... ఎక్కడో మారుమూల ప్రాంతంలోని ఆర్డీవో స్థాయి పోస్టులోకి బదిలీ చేయడంతో కంగుతిన్న ఐఏఎస్ లు... జగన్ కు ఏదైనా సలహా ఇవ్వడానికే భయపడుతున్నారట. నచ్చినా నచ్చకపోయినా, ఎస్ బాస్ అనడం మినహా ఎదురుచెప్పలేని పరిస్థితి నెలకొందట.

ఐఏఎస్ ల పరిస్థితి ఇలాగుంటే, ఐపీఎస్ ల ఇబ్బందులు మరో రకంగా ఉన్నాయట. రాజధాని భూములు, ఇతర అంశాల్లో చంద్రబాబు అండ్ లోకేష్... అలాగే ఇతర టీడీపీ ముఖ్యనేతలను ఇరికించాలంటూ సీఎం జగన్ నుంచి ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నట్లు సచివాలయ వర్గాలు చెబుతున్నాయి. రాజధాని భూముల విషయంలో బాబుని ఇరికించడానికి ఎలాంటి ఆధారాలు దొరకలేదంటూ విజిలెన్స్ అండ్ సీఐడీ అధికారులు చెప్పడంతో... జగన్మోహన్ రెడ్డి వాళ్లపై ఫైరైనట్లు చెబుతున్నారు. ఇద్దరు ఐపీఎస్ లను ఇదే పని మీద నియమించినా ఏం చేస్తున్నారంటూ సీఎం మండిపడ్డారట. సీఆర్డీఏ అధికారులు చేతులు ఎత్తేయడంతో విజిలెన్స్ అండ్ సీఐడీ అధికారులను రంగంలోకి దించారు. అయితే వాళ్లు కూడా చేతులెత్తేయడంతో జగన్ తీవ్ర అసహనం వ్యక్తంచేశారట.

మొదట్లో అన్నా... అన్నా... అంటూ పిలుస్తుంటే... జగన్మోహన్ రెడ్డి చాలా ఫ్రీగా ఉంటారనుకుని సంబరపడ్డ అధికారులు... ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారట. జగన్ చెప్పింది చేయాల్సిందేనని... ఎదురు చెబితే ఇక అంతేనని మాట్లాడుకుంటున్నారు. ఇక, వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో అత్యుత్సాహం ప్రదర్శించిన అధికారులు సైతం ఇఫ్పుడు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారట.