నిర్భయ కేసు... భద్రతా కారణాల వల్ల 18వ తేదీకి వాయిదా

నిర్భయ దోషుల ఉరిశిక్ష పై విచారణ ఈ నెల 18 కి వాయిదా పడింది. భద్రతా కారణాల దృష్ట్యా దోషులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే పటియాలా కోర్టు విచారించింది. దోషులకు త్వరగా ఉరిశిక్ష అమలు చేయాలంటూ పటియాలా హౌస్ కోర్టులో నిర్భయ తల్లిదండ్రులు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై నవంబర్ 29 న అడిషనల్ సెషన్స్ జడ్జి ప్రొడక్షన్ వారెంట్ జారీ చేశారు. వారెంట్ ప్రకారం ఇవాళ కోర్టు ముందుకు నిర్భయ దోషులు హాజరు కావాల్సి ఉంది. అయితే తీహార్ జైల్లో ఉన్న దోషులను బయటకు తీసుకు వచ్చే పరిస్థితి లేక పోవడంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే కోర్టు విచారించింది. సుప్రీం కోర్టు ఇప్పటికే మరణ శిక్ష విధించిందని మెర్సీ పిటిషన్ లు కూడా తిరస్కరించారని ఇక ఆలస్యం చేయకుండా శిక్షను అమలు చేయాలని నిర్భయ పేరెంట్స్ కోర్టుకు విన్నవించారు. 

మరోవైపు తనకు విధించిన మరణశిక్ష పై రివ్యూ చేయాలని దోషుల్లో ఒకరైన అక్షయ్ కుమార్ సింగ్ మంగళవారం సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. దీని పై డిసెంబర్ 17న అత్యున్నత న్యాయస్థానం విచారించనుంది. త్రిసభ్య ధర్మాసనం అక్షయ్ సింగ్ పిటిషన్ పై రివ్యూ చేయనుంది. ఒకవేళ తీర్పు పై రివ్యూ చేసేది లేదని గత తీర్పే ఫైనల్ అని సుప్రీం కోర్టు చెబితే మరణ శిక్షకు రూట్ క్లియర్ అయినట్టే. తీహార్ జైల్లోనే దోషులను ఉరితీసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బక్సర్ జైలు నుండి ఉరితాళ్లు కూడా ఆర్డర్ చేశారు. నలుగురికీ ఒకేసారి ఉరిశిక్ష అమలు చేసే అవకాశమున్నట్టు సమాచారం. అయితే జైలు నిబంధనల ప్రకారం క్షమాభిక్ష పిటిషన్లను తిరస్కరించిన 14 రోజుల తరువాతే మరణ శిక్ష విధించాల్సి ఉంటుంది. దోషుల కుటుంబ సభ్యులకు ఎప్పుడు ఉరితీస్తున్నారో సమాచారమివ్వాలి. ఈ గ్యాప్ లో కుటుంబ సభ్యులను కలుసుకునేందుకు అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది. తమ వస్తువులను కుటుంబ సభ్యులకు అందజేసే చాన్సుంది. ఉరివేసి ఒక రోజు ముందు దోషులు కోరుకున్న ఆహారం అందించాలి. నిబంధనలను బట్టి చూస్తే సుప్రీం కోర్టు రివ్యూ పిటిషన్ ను కొట్టివేసినా ఉరిశిక్ష అమలకు మరికొన్ని రోజులు పట్టే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు ఏడేళ్ల నుండి న్యాయం కోసం ఎదురు చూస్తున్నామని ఇప్పటికీ శిక్ష అమలు చేయడం లేదంటూ నిర్భయ తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే మరణ శిక్ష అమలు చేయాలని నిర్భయ తల్లి డిమాండ్ చేస్తున్నారు.