అమరావతిలో పెయిడ్‌ ఉద్యమం.. వీడియోతో అడ్డంగా బుక్కయ్యారు!!

అమరావతినే ఏపీ ఏకైక రాజధానిగా ఉంచాలని డిమాండ్ చేస్తూ 300 ల రోజుల నుంచి అమరావతి ప్రాంత రైతులు ఉద్యమం చేస్తుంటే.. అది ఉద్యమమే కాదని, అసలు వాళ్ళంతా రైతులు కాదు పెయిడ్ అరిస్ట్ లని అన్న జగన్ సర్కార్.. ఇప్పుడదే అమరావతి ఉద్యమాన్ని చూసి భయపడుతోందా?. అమరావతి రైతులు చేస్తున్న ఉద్యమానికి వ్యతిరేకంగా పెయిడ్‌ ఉద్యమాన్ని మొదలు పెట్టించడం చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. 

 

అమరావతి రైతులకు పోటీగా శనివారం నాడు మందడంలో ఓ శిబిరం వెలిసింది. అయితే, ఆ శిబిరంలో పాల్గొన్నవారికి శిక్షణ ఇస్తున్నట్లు ఉన్న వీడియో ఒకటి లీక్ అయింది. ఆ వీడియో చూస్తే అమరావతి రైతులుకి వ్యతిరేకంగా పెయిడ్‌ ఉద్యమం నడిపే ప్రయత్నం చేస్తున్నారని స్పష్టంగా అర్థమవుతోంది. ఆ వీడియోలో ఓ వ్యక్తి శిబిరానికి వచ్చిన మహిళలకు ఏం మాట్లాడాలో శిక్షణ ఇస్తున్నాడు. ఏ ఊరని ఎవరైనా అడిగితే రాజధాని ప్రాంతంలోని గ్రామమని చెప్పమన్నాడు. రాష్ట్రవ్యాప్తంగా 30 లక్షల ఇళ్ల స్థలాల పంపిణీని అడ్డుకున్నారని.. అందువల్లే రిలే దీక్షలో పాల్గొంటున్నామని చెప్పమని మహిళలతో చెబుతున్నట్లు వీడియోలో ఉంది. అంతేకాదు, డబ్బులు కోసం కాదు.. ఇళ్ల స్థలాల కోసమే స్వచ్ఛందంగా వచ్చామని చెప్పాలని వారికి చెబుతున్నట్లు వీడియోలో రికార్ట్ అయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

ఇప్పటి వరకూ రాజధాని కోసం ఉద్యమం చేస్తున్న వారిని పెయిడ్ ఆర్టిస్టులు అని వక్రంగా మాట్లాడిన అధికార పార్టీ నేతలు.. ఇప్పుడు వీడియోతో అడ్డంగా బుక్కయిన ఈ వ్యవహారంపై ఏం సమాధానం చెప్తారోనన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా అమరావతి రైతులు అధికార పార్టీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమరావతి ఉద్యమానికి మద్దతు పెరుగుతుందన్న భయం ప్రభుత్వంలో మొదలైందని, అందుకే పెయిడ్‌ ఉద్యమాన్ని చేయిస్తోందని మండిపడుతున్నారు.