ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం వెనుక మహా రహస్యం.. 80 గంటల్లో 40వేల కోట్లు!!

 

మహా రాజకీయం కొన్నిరోజుల పాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. అనేక ట్విస్ట్ ల తరువాత.. శివసేన-కాంగ్రెస్- ఎన్సీపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసాయి. అయితే అంతకన్నా ముందు పూర్తి మెజారిటీ లేకపోయినా ఎన్సీపీ నేత అజిత్ పవర్ తో కలిసి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం గా అజిత్ పవర్ ప్రమాణస్వీకారం చేసారు. అయితే మూడురోజులు కూడా తిరగకుండానే.. తమకి తగిన మెజారిటీ లేదంటూ రాజీనామా చేసారు. మరి ఈ మాత్రం దానికి ప్రమాణ స్వీకారం ఎందుకు చేసారని అప్పట్లోనే సెటైర్లు వినిపించాయి. కానీ తాజాగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణస్వీకారం వెనుక ఓ రహస్యం ఉందంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. మహారాష్ట్ర ప్రభుత్వం దగ్గరున్న రూ.40,000 కోట్ల రూపాయలను కేంద్రానికి తిరిగి అప్పగించేందుకే ప్రమాణ స్వీకారం డ్రామా ఆడారని కర్ణాటకు చెందిన మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ అనంత్ కుమార్ హెగ్డే సంచలన వ్యాఖ్యలు చేసారు.

ఉత్తర కన్నడ లోని ఎల్లపోర్ నియోజకవర్గ ఉప ఎన్నికల ప్రచారంలో అనంత్ కుమార్ హెగ్డే మాట్లాడుతూ.. అభివృద్ధి పనుల కోసం కేటాయించిన కేంద్రం నిధుల నుంచి రూ.40వేల కోట్లు వినియోగించుకునేందుకు సీఎంకు అధికారం ఉంటుందని.. కొత్త ప్రభుత్వం వస్తే అభివృద్ధి పేరుతో వాటిని దుర్వినియోగం చేస్తుందని భావించిన బీజేపీ.. ఈ ప్రమాణస్వీకారం డ్రామా ఆడిందని అన్నారు. 80 గంటల్లో ఆ డబ్బులు చేరాల్సిన చోటుకు చేరాయని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఈ విషయాన్ని తాను ఫడ్నవీస్ తో నిర్ధారించుకన్నట్టు కూడా చెప్పారు హెగ్డే. కాగా, సొంత పార్టీ ఎంపీ చేసిన వ్యాఖ్యలు వివాదస్పదం కావడంతో దీనిపై ఫడ్నవీస్ వివరణ ఇచ్చారు. తాను అధికారంలో ఉన్న ఆ కొన్ని గంటల్లో ఎలాంటి విధాన నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. అలాంటిది ఏమైనా ఉంటే ప్రభుత్వ ఆర్ధిక శాఖ దర్యాప్తు చేసుకోవచ్చన్నారు. అసలు హెగ్డే ఎందుకు అలాంటి ఆరోపణలు చేశారో తనకు తెలియదని ఫడ్నవీస్ అన్నారు.