టీడీపీ ఖాతాలో 155కోట్లు... వైసీపీ అకౌంట్లో 138కోట్లు... టీఆర్ఎస్ కి 188కోట్లు

 

సార్వత్రిక ఎన్నికలు ముగిసి ఏడు నెలలు దాటిపోయింది. కొత్త ప్రభుత్వాలు ఏర్పాటై కూడా ఆర్నెళ్లు కావొస్తోంది. అయితే, సార్వత్రిక ఎన్నికల్లో ఆయా పార్టీలు పెట్టిన ఖర్చులపై ఎన్నికల సంఘానికి లెక్కలు సమర్పిస్తున్నాయి. వచ్చిన విరాళాలు... ఎన్నికల్లో ఖర్చుపై... వైసీపీ... అలాగే టీడీపీ... వివరాలు వెల్లడించాయి. అయితే, ఎన్నికల సమయానికి కేవలం 74లక్షలు మాత్రమే బ్యాంకు బ్యాలెన్స్ కలిగివున్న వైసీపీకి... ఎన్నికలు ముగిసేనాటికి 221కోట్ల రూపాయల విరాళాలు వచ్చాయి. ఇందులో 85కోట్లను ఎన్నికల కోసం ఖర్చు చేసింది వైసీపీ. 9.72కోట్లు స్టార్ క్యాంపెయినర్ల కోసం... 36కోట్లు మీడియా ప్రకటనల కోసం వ్యయం చేశారు. మీడియా ప్రకటనల కోసం ఖర్చు చేసిన 36కోట్లలో... వైఎస్ జగన్ కుటుంబానికి చెందిన జగతి పబ్లికేషన్స్ కే 24 కోట్లు ముట్టచెప్పారు. ఇక, వైసీపీకి రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరించిన ప్రశాంత్ కిశోర్ కి రికార్డు స్థాయిలో 37కోట్ల రూపాయలు చెల్లించింది. అలా, ఎన్నికల ఖర్చు తర్వాత వైసీపీ బ్యాంకు ఖాతాలో 138కోట్లు ఉన్నట్లు ఎన్నికల కమిషన్ కు ఇచ్చిన నివేదికలో పేర్కొంది. ఇక, వైసీపీకి వచ్చిన విరాళాల్లో 181కోట్లు విరాళాల ద్వారా, 99కోట్లు ఎన్నికల బాండ్ల ద్వారా, 36కోట్లు నాన్ కార్పొరేట్ సంస్థల ద్వారా వచ్చినట్లు యాన్యువల్ ఆడిట్ రిపోర్ట్ లో వైసీపీ ప్రకటించింది.

ఇక, ఘోర పరాజయం చవిచూసి, కేవలం 23 సీట్లకే పరిమితమైన తెలుగుదేశం... ఎన్నికల కోసం 77కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపింది. అందులో మీడియా ప్రకటనల కోసం 49కోట్లు ఖర్చు చేయగా, హెలికాప్టర్ల వినియోగం కోసం 9కోట్లు వ్యవయం చేసింది. ఇక, ఎన్నికల నాటికి టీడీపీ అకౌంట్లో 102 కోట్లు ఉండగా, విరాళాల రూపంలో 131కోట్లు వచ్చాయి. ఎన్నికల వ్యయం తర్వాత టీడీపీ అకౌంట్లో ఇంకా 155కోట్లు ఉన్నట్లు ప్రకటించింది.

ఇక, తెలంగాణలో రెండోసారి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్... కేవలం 29కోట్లు మాత్రమే ఖర్చు చేసినట్లు ఎలక్షన్ కమిషన్ కు ఇచ్చిన ఆడిట్ రిపోర్ట్ లో తెలిపింది. అలాగే, విరాళాల రూపంలో 188కోట్లు వచ్చినట్లు తెలిపింది. అయితే, ఏపీలో మాత్రమే వైసీపీ, టీడీపీ పోటాపోటీగా ఎన్నికల కోసం డబ్బును మంచినీళ్లలా ఖర్చు చేశాయి. తెలుగుదేశం 77కోట్లు ఖర్చుచేస్తే... వైసీపీ మరింత ఎక్కువగా 85కోట్ల రూపాయలను వ్యయం చేసింది.