పోలీసులపై లగడపాటి ఫైర్.. వారెంట్‌ లేకుండా సోదాలు ఎలా చేస్తారు?

 

జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 12లో ఐపీఎస్‌ అధికారికి చెందిన భూమికి తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించారని బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో ప్రముఖ వ్యాపారవేత్త జీపీ రెడ్డిపై గతంలో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి 10 గంటల సమయం దాటాక జూబ్లీహిల్స్‌లోని రోడ్‌ నంబర్‌ 65లో నివాసముంటున్న జీపీ రెడ్డి ఇంట్లో తనిఖీలు చేసేందుకు వెస్ట్‌జోన్‌ డీసీపీ ఏఆర్‌ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో పోలీసులు వచ్చారు. సమాచారం అందుకున్న లగడపాటి వెంటనే అక్కడికి చేరుకుని ఏ ఆధారాలతో వచ్చారని పోలీసులను నిలదీశారు. ఎటువంటి వారెంట్‌ లేకుండా సోదాలు ఎలా చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంట్లోకి వచ్చేందుకు వీలు లేదంటూ వారిని అడ్డుకున్నారు.

తనిఖీలకు వచ్చిన ఎస్‌ఐలు ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఎస్‌ఐ ఫోన్‌లో మాట్లాడుతుండగానే ఆ ఫోన్ తీసుకున్న లగడపాటి ఉన్నతాధికారితో ఆవేశంగా మాట్లాడారు. ‘ఈ కేసు సివిల్‌ వ్యవహారం, ఐజీ నాగిరెడ్డి ఒత్తిడితో అర్థరాత్రి ఇంటిపైకి ఎలా వస్తారు. జీపీ రెడ్డి నాలుగేళ్ల నుంచి ఇదే ఇంట్లో ఉంటున్నారు. ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికలు వచ్చిన కారణంగా మిమ్మల్ని ఎవరూ బదిలీ చేయలేరన్న ధీమాతో ఏమైనా చేయొచ్చని అనుకుంటున్నారా? జీపీ రెడ్డి పోలీస్‌స్టేషన్‌కు ఎన్ని సార్లు వచ్చారో మీకు తెలీదా? పోలీసులకు, జైళ్లకు, అరెస్టులకు భయపడి జీవించే అవసరం మాకు లేదు. నాకు చట్టాలు బాగా తెలుసు. పోలీసులకు ఎవరిపైన అయినా కేసులు పెట్టే అధికారం ఉంది. కానీ మీకున్న విస్తృత అధికారాలు ఉపయోగించి ఎవరినైనా అరెస్ట్‌ చేయాలనుకుంటే కుదరదు’ అంటూ లగడపాటి తీవ్రంగా హెచ్చరించారు.

ఈ కేసు విషయమై జీపీ రెడ్డి ఇప్పటికే 20సార్లు పోలీసు విచారణకు వెళ్లారని.. అయినా ఆయన్ని వేధిస్తూనే ఉన్నారని లగడపాటి మీడియాతో అన్నారు. ఈ వ్యవహారాన్ని ఐజీ నాగిరెడ్డితో సెటిల్‌ చేసుకోవాలని పోలీసులు తన స్నేహితుడిని వేధిస్తున్నారని ఆరోపించారు. ఈ సోదాల వెనుక ఐజీ నాగిరెడ్డి, వెస్ట్‌జోన్‌ డీసీపీ శ్రీనివాస్‌ ప్రమేయం ఉందని ఆరోపించారు. దీనిపై గవర్నర్‌, ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తానని ఆయన తెలిపారు.