కావాలనే అచ్చెన్నను ఇరికిస్తున్నారా? ఈఎస్ఐ స్కామ్ లో అసలు నిజమేంటి?

తెలంగాణ ఈఎస్‌ఐ స్కామ్ తరహాలోనే ఆంధ్రప్రదేశ్‌లోనూ భారీ కుంభకోణం బయటపడింది. ఏపీలో రాజకీయంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోన్న ఈ కుంభకోణంలో గత ప్రభుత్వ పెద్దల హస్తం ఉందన్న నిజాన్ని విజిలెన్స్‌ అధికారులు గుర్తించారు. మాజీ మంత్రి అచ్చెన్నాయుడు పేరు ప్రముఖంగా వినిపిస్తుండటంతో కేసు పూర్వాపరాలపై రాజకీయంగా చర్చ జరుగుతోంది. 

మెడిసిన్స్, ల్యాబ్ కిట్స్, బయోమెట్రిక్ మెషీన్స్, ఫర్నీచర్, ఈసీసీ సర్వీసులు, బయోమెట్రిక్ యంత్రాల కొనుగోళ్లలో భారీ అక్రమాలు జరిగినట్టు ఈడీ తేల్చింది. వాస్తవ ధర కంటే 132శాతం ఎక్కువ ధరకు మందుల కొనుగోళ్లు చేశారని గుర్తించింది. ఒక్కో బయోమెట్రిక్ వాస్తవ ధర 16వేలు కాగా.... 70వేలకు వాటిని కొనుగోలు చేసినట్లు బయటపెట్టింది. నకిలీ కంపెనీల పేరుతో బిల్లులు సృష్టించి నిధులు మళ్లించినట్టు గుర్తించింది. మెడికల్ కోసం ప్రభుత్వం 293 కోట్లు ఈఎస్ఐకి కేటాయించగా.... అధికారులు 698కోట్ల బిల్లులు సృష్టించినట్టు తేల్చింది. ఈ స్కామ్‌లో ముగ్గురు డైరెక్టర్లతోపాటు ఆరుగురు జాయింట్ డైరెక్టర్ల పాత్ర ఉన్నట్టు ప్రాథమికంగా తెలుస్తోంది.

నిజానికి మెడికల్ కొనుగోళ్లను టెండర్ పద్దతిలోనే చేపట్టాలన్న నిబంధన ఉంది. అయితే అప్పటి మంత్రి అచ్చెన్నాయుడు సిఫారసు మేరకు అనుమతి లేని కొన్ని కంపెనీల నుంచి నామినేషన్ పద్దతిలో 51కోట్ల మెడిసిన్ కొనుగోళ్లు చేశారని నివేదికలో పొందుపరిచారు. టెలీ హెల్త్ సర్వీసెస్ కంపెనీ నుంచి మందుల కొనుగోళ్లకు అచ్చెన్నాయుడు సిఫారసు లేఖ రాసినట్టు తేల్చారు. విజిలెన్స్ శాఖ ఈ స్కామ్‌పై ప్రభుత్వానికి నివేదిక అందచేయడంతో.... దీనిపై విచారణకు ఆదేశించినట్టు తెలుస్తోంది. అయితే ఈఎస్ఐ స్కాంపై మాజీ మంత్రి అచ్చెన్నాయుడు స్పందించారు. తాను తప్పు చేయలేదని, చేయబోనన్నారు. ప్రధానమంత్రి మోడీ ఆదేశాల మేరకే టెలీ హెల్త్ సర్వీసెస్‌కు నామినేషన్ పద్దతిలో కేటాయించాలని తాను లేఖ రాసినట్టు వివరించారు. మొత్తానికి ఏపీలో బయటపడిన ఈఎస్‌ఐ కుంభకోణంలో ఇంకెవరి పేర్లు బయటకు వస్తాయో... రాజకీయంగా ఇది ఏ మలుపు తీసుకుంటుందన్న చర్చ బలంగా నడుస్తోంది. దాదాపు 400కోట్ల రూపాయల గోల్ మాల్ జరిగినట్లు గుర్తించగా, ఈ కుంభకోణం వెనుక మాజీ మంత్రి అచ్చెన్నాయుడు హస్తం ఉందన్న ప్రచారంతో రాజకీయ దుమారం రేగుతోంది.